తెలంగాణలో బిసి రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. 42 శాతం బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్ద చేయాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేయగా.. బుధవారం విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు.
42 శాతం రిజర్వేషన్లకు శాస్త్రీయ ఆధారాలు చూపలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బిసి కులగణన చేశారు కానీ.. దానిని బహిర్గతం చేయలేని అన్నారు. 2018లో 34 శాతం బిసి రిజర్వేషన్లను ఇదే కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మరోవైపు రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామి అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలపై నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ తరుఫు న్యాయవాది కోరగా.. హైకోర్టు పట్టించుకోలేదు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
కాగా, విచారణ వాయిదా పడటంతో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. హైకోర్టులో ఇవాళ జరిగిన వాదనలు, రేపు వ్యవహరించాల్సిన అంశాలపై అడ్వకేట్ జనరల్‌తో మంత్రుల చర్చించినట్లు తెలుస్తోంది.