వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ ఒక ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ విజయంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. బ్యాట్‌తో సెంచరీ సాధించిన ఈ ఆల్ రౌండర్, బౌలింగ్‌లోనూ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయాన్ని సునాయాసం చేశాడు.
అయితే తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జడేజాతో పాటు తొలి టెస్ట్‌లో ఏడు వికెట్లు తీసిన సిరాజ్ కూడా తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు(718 పాయింట్ల)సాధించి మూడు స్థానాలు మెరుగుపడి 12వ స్థానానికి చేరుకున్నాడు. ఇక జడేజా విషయానికొస్తే.. బ్యాటింగ్‌లో 644 పాయింట్లతో ఆరు స్థానాలు ఎగబాకి 25 ర్యాంకు దక్కించుకున్నాడు. ఇక తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కెఎల్ రాహుల్ 4 స్థానాలు జంప్ అయి 35వ స్థానంలో స్థిరపడ్డాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా టాప్ ర్యాంకులో ఉన్నాడు.