సుప్రీం కోర్టు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై ఓ మూర్ఖపు న్యాయవాది బూటుతో దాడికి ప్రయత్నించడం యావత్ దేశానికి పెద్ద షాక్. దాడి చేసిన వ్యక్తి ‘సనాతన ధర్మాన్ని అగౌరవ పర్చడం భారతదేశం ఎన్నడూ సహించదు’అని బెదిరించడం వినిపించింది. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయ సముదాయంలో ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని కోరుతూ పిటిషన్ దాఖలు కాగా ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సిజెఐ కొన్ని వ్యాఖ్యలు చేశారు. విష్ణువుకు వీరభక్తుడినని చెప్పుకుంటున్నావు కదా! వెళ్లి ఆ దేవుడిని ప్రార్థించుకో. అదో ఆర్కియాలజీ సైట్. దానికి ఆర్కియాలజీ పర్మిషన్ అవసరం ఉంటుందని సిజెఐ వ్యాఖ్యానించడం బిజెపి అనుకూల సామాజిక మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యమే న్యాయవాది దౌర్జన్యానికి కారణమైంది. సిజెఐ ఆ వ్యాఖ్యలను బాగా చెప్పి ఉండవచ్చని వాదించినప్పటికీ, ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన స్వేచ్ఛగా భావప్రకటన చేసే రాజ్యాంగపరమైన హక్కు సిజెఐ ప్రకటనకు రక్షణ కల్పిస్తుంది. అయినాసరే ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో దానికి సిజెఐ తనదైన శైలిలో తెరదించారు. తరువాత ఓ కేసులో స్పందిస్తూ తానేమీ ఏ మతాన్ని అమర్యాద పర్చలేదని, అన్ని మతాలను తాను గౌరవిస్తానని, కేవలం సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వ్యతిరేక ప్రచారం అయినట్టు వివరించారు. సరైన సలహా ఉంటే ఈ విషయం అక్కడే నిలిచిపోయేది.
అయితే దాడికి ప్రయత్నించిన న్యాయవాది, 71 ఏళ్ల న్యాయశాస్త్ర అనుభవజ్ఞుడే కాక, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు కూడా. అయినా సనాతన ధర్మ మొదటి సూత్రాలను అంతర్గతీకరించే పరిపక్వత లేదు. హింసను త్యజించడం, ఆలోచనలను స్వేచ్ఛగా పరస్పరం పంచుకోవడం అనేవి సనాతన ధర్మంలోని ప్రధాన సూత్రాలు. కేవలం సంకుచిత దృష్టితో అత్యున్నత న్యాయస్థానానికి అధ్యక్షత వహించే ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయాలని అపేక్షించడం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఇప్పటివరకు విచ్చలవిడి రాజకీయ నాయకుల పైన, పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న నేరస్థులనే అనుమానితుల పైన మితవాద హింసాకాండ సాగడం పరిపాటిగా వస్తోంది. ఇప్పుడీ సంఘటన సోషల్ మీడియాలో పరమత విద్వేషం ప్రదర్శించడం, విషపూరిత టెలివిజన్ చర్చలు సర్వసాధారణమైనట్టు కనిపిస్తోంది. ఇవి సామాజిక ఒత్తిడిని పెంచేలా వేలెత్తి చూపుతున్నాయి. సిజెఐ గవాయి మారిషస్‌లో, భారతదేశంలోని చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన పాలన, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి ప్రముఖంగా ప్రసంగించిన చాలా రోజులకు సుప్రీంకోర్టులో నాటకీయంగా ఈ సంఘటన జరగడం అనూహ్యం. మతోన్మాద న్యాయవాది బూటు విసరడానికి ప్రయత్నించినా, సిజెఐని వేలెత్తి చూపుతూ హెచ్చరించినా సిజెఐ మాత్రం ఎలాంటి కలవరం చెందలేదు.
సుప్రీం కోర్టు రిజిస్ట్రీ కూడా ఎలాంటి కేసులు దాఖలు చేయలేదు. అపరాధిని బయటకు వెళ్లనిచ్చేరు. విశేష న్యాయపరమైన దయ చూపించడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు ప్రాంగణంలో సిజెఐపై దాడికి పాల్పడడం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. దాడి సమయంలో జస్టిస్ గవాయ్ ప్రశాంతతను ప్రదర్శించడం అభినందనీయం. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను ఉద్దీపింప చేస్తుంది’ అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో సిజెఐని ప్రశంసించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. బీహార్‌లో కులాల ఆధారంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న పోరాటం నుంచి దృష్టి మళ్లించడానికి ప్రధాని మోడీ ఈ విధంగా సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఆ తలతిక్క న్యాయవాది లైసెన్సిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఇటువంటి సర్వవ్యాప్త చర్యలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించని రాష్ట్ర హైకోర్టు జడ్జీలు కొందరి ఉదంతాలు కూడా బయటపడ్డాయి గత మే నెలలో ఇద్దరు జడ్జీలను సుప్రీం ధర్మాసనం ఇటీవల ఘాటుగా మందలించింది.
మోసపూరిత కేసులో ఒకే నిందితునికి అనుకూలంగా బెయిలు మంజూరు చేయడంలో అసలు ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, ఒక కేసులో తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన గత తీర్పుకు భిన్నంగా బెయిల్ మంజూరు చేశారని మధ్యప్రదేశ్ సెషన్స్ జడ్జిని ఆక్షేపించింది. ఈ జడ్జిని ఢిల్లీలో వారం రోజుల పాటు శిక్షణ తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. 2023 మేలో అలహాబాద్ హైకోర్టు సెషన్స్ జడ్జిని విధుల నుంచి తప్పించి వారం రోజుల పాటు జ్యుడీషియల్ అకాడమీకి శిక్షణ కోసం పంపాలని ఆదేశించింది.దీనివల్ల వారి నైపుణ్యం మెరుగుపడుతుందని సూచించింది. ఈ సంఘటనలు న్యాయవ్యవస్థలో అవినీతి, అసమర్థత ప్రక్షాళనం చేయడానికి తోడ్పడతాయి. న్యాయవ్యవస్థను అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. చాలా మందిలో పోటీతత్వం, విశ్వసనీయత ఉండడం లేదని కొన్ని సంఘటనల బట్టి తెలుస్తోంది. పెండింగ్ కేసుల భారం, కాలం చెల్లిన చట్టాలు, విధానాలు, వనరుల కొరత, మౌలిక సౌకర్యాల లోపం, ఇవన్నీ ప్రజాస్వామ్య మూలస్తంభమైన న్యాయవ్యవస్థను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. కొంతమంది న్యాయవాదులు, జడ్జీలు అవినీతిపరులు కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. న్యాయస్థానాల్లో అవాంఛనీయ సంఘటనలు గతంలో కూడా జరిగాయి. న్యాయమూర్తులపై దాడులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలు, హైకోర్టు జడ్జీల ప్రవర్తనపై సుప్రీం కోర్టు ఆందోళన చెందడం, అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులు నిరవధిక సమ్మె చేయడం, తెలంగాణ హైకోర్టులో కక్షిదారుల దురుసు ప్రవర్తన, తదితర సంఘటనలు ఎన్నో జరిగాయి.