మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చేతిలో రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ నెల 8న బుధవారం హైకోర్టులో స్థానిక సంస్థల్లో 42 శాతం బిసిలకు రిజర్వేషన్లు అమలు చేసే జివో9పై ఎటువంటి నిర్ణయం వెలువడుతోందని ఉ త్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి చూపు హై కోర్టు వైపే ఉంది. ఏడాదిన్నర ఆలస్యంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండడంతో కోర్టు ఇచ్చే ఆదేశాలు ఇప్పుడు కీలకం కాబోతున్నందున అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.
ముఖ్యంగా ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ తెగ మదన పడుతున్నాయి. రిజర్వేషన్ల అమలుకు ఆ జివోను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థిస్తుందా..? లేక కొట్టివేస్తుందా..? అనే గందరగోళ పరిస్థితిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు అనుగుణంగా వ్యూహచరన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి తదితరులతో కీలక సమావేశం నిర్వహించారు.
కోర్టులో అనుసరించాల్సిన వ్యూహాం, సాంకేతిక అంశాలపై ఏవిధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలను అటు రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తోనూ చర్చించారు. నేతలు, మంత్రులు, అధికారులతో పాటు ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాలు అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ దవేతో ఈ కేసు పైన సీఎం రేవంత్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. కేసులో బలంగా వాదన వినిపించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అంతేకాకుండా కోర్టులో ఏమాత్రం ప్రతికూలంగా నిర్ణయం వెలువడితే ప్లాన్ బి ప్రకారం ఎలా ముందుకెళ్లాలనేది కూడా మంత్రులు, కీలక నేతలంతా న్యాయకోవిదులతో మంతనాలు కూడా సాగించారు. ఈ దశలో ప్రభుత్వం తన వాదన గట్టిగా వినిపించి ఎలాగైనా న్యాయస్థానంలో నెగ్గుకు రావాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తరఫున ఈ కేసులో వాదించేందుకు దిగ్గజ న్యాయవాదులను రంగంలో దింపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. బి మాధవ్ రెడ్డి, గోరేటి వెంకటేష్‌లు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 8న చేపట్టనున్నట్లు తెలిపింది.
దీంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలతో స్థానిక సంస్థల భవితవ్యం ఆధారపడి ఉంది. గ్రామాల్లో సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ సైతం అమల్లో ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన జివోను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లను కూడా బి మాధవ్ రెడ్డి, గోరేటి వెంకటేష్ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు అక్టోబర్ 8న విచారణకు వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన మడివాల మచ్చదేవ, ఎస్ లక్ష్మయ్య, మరొకరు ఈ పిటీషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లను కేటాయించడంలో విఫలమైందని ఆ పిటీషన్లలో ఆరోపించారు. సమాన ప్రాతినిధ్యం నిర్ధారించడానికి బీసీలలో ఉప-వర్గీకరణ అవసరమని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా ప్రస్తుత రిజర్వేషన్ ప్రక్రియ వల్ల కొన్ని వర్గాల వారికే ప్రయోజనం దక్కుతుందని పేర్కొన్నారు. దీంతో ఈ జీవోను నిలిపివేయాలని, ఎన్నికలు నిర్వహించే ముందు బీసీ రిజర్వేషన్లను తిరిగి వర్గీకరించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
42 శాతం రిజర్వేషన్ల అమలుకు పలు ఇంప్లీడ్ పిటీషన్లు దాఖలు
ఇదిలావుంటే బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి మద్దతు పెరిగింది. ఈ కేసులో పలువురు ఇంప్లీడ్ అయ్యేందుకు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. పార్టీలకు అతీతంగా, వ్యక్తులు ఈ పిటీషన్లు దాఖలు చేసి బిసి నాయకులంతా ఒకటయ్యారు. ఈ కేసులో రాష్ట మున్నూరు కాపు అపెక్స్ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న, బీజేపీ రాజ్య సభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, సాయికుమార్, లక్ష్మణ్ యాదవ్, చిరంజీవులు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, విడుదల చేసిన జివోను సమర్థిస్తూ బిసిలకు న్యాయం చేయాలని వీరంతా న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటీషన్లపై బుధవారం విచారణ జరుగనుంది. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలైనప్పటికీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తుందోనని వీరందరిలో ఉత్కంఠ కొనసాగుతుంది.