మనతెలంగాణ/హైదరాబాద్ : సచివాలయం నిర్మాణంలో మరోసారి డొల్లతనం బయటపడింది. నాసిరకం పైపుల కారణంగా ఇటీవల కురిసిన వర్షానికి పైపుల్లో వర్షం నీరు చేరి లీకేజీ ఏర్పడింది. దీంతో సెక్రటేరియట్‌లోని పలు శాఖల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడడంతో పాటు పలు మంత్రుల చాంబర్‌లోకి వర్షం రావడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఇక, 4వ అంతస్తులోని మంత్రి కొండా సురేఖ పేషీలోని పైపుల్లో వర్షం నీరు నిలిచిన కారణంగా విద్యుత్ వైర్లు, ప్రింటర్లు, ఇంటర్ నెట్ సేవలకు బ్రేక్ పడింది. ఇంటర్నెట్ సేవలు ఆగిపోవడంతో ఫైల్స్ అప్‌లోడ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది నిలిచిపోయిన సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ భవనంలో తరుచూ లోటుపాట్లు కలకలం రేపుతోంది. గతంలో పెచ్చులు ఊడిపోయిన ఘటనలు చోటుచేసుకోవడం తెలిసిందే.