బిలాస్‌పూర్: హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్టు బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 18మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం (అక్టోబర్ 7) హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా ఝండుత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కొండచరియలు నేరుగా బస్సుపై విరిగిపడ్డాయి. దీంతో శిథిలాలు, రాళ్ళ కిందనే బస్సు చిక్కుకుపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు సైతం చిక్కుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణిస్తున్నారని స్థానిక అధికారులు తెలిపారు. కొండచరియల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ విషాద ప్రమాదంలో 18 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 18మంది ప్రయాణికులు మరణించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి రూ.2 లక్షల చొప్పున.. గాయపడిన వారికి 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రధాని ప్రకటించారు.