గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన సంఘటన హుస్నాబాద్ మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిధిలోని జిల్లెల్లగడ్డ గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి నంగునూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమారుడు వివేక్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాగా కారిడార్‌లో ఆడుతుండగా ప్రమాదవశాత్తు మెడకు తాడు చుట్టుకొని మృతి చెందినట్లు పాఠశాల ఉపాధ్యాయులు అందించిన సమాచారంగా తెలుస్తుంది. వెంటనే పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడి బంధువులు, గ్రామస్థులు వివేక్ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లెల్లగడ్డ గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల సమీప నేషనల్ హైవే రహదారిపై ధర్నా నిర్వహించారు. గిరిజన పాఠశాల ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.