న్యూఢిల్లీ: లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) డిప్యూటీ చీఫ్, పహల్గాం ఉగ్రవా దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి, ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ బెదిరింపు జారీ చేశారు. ‘పహల్గాం2’ అనే రెండో దాడి చేస్తామని హెచ్చరించారు. సిఎన్‌ఎన్‌న్యూస్ 18 దీనికి సంబంధించిన వీడియోను పొందాయి. అందులో ఉద్దేశపూర్వకంగా అనియంత్రిత నీటి విడుదలతో పాకిస్థాన్‌ను వరదలతో ముంచెత్తారని ఆరోపించారు. భారత్ నీటి ఉగ్రవాదానికి పాల్పడుతోందన్నారు. ఈ వీడియో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఆయన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను కూడా తెగ ప్రశంసించారు. ఆయన్ని ‘ఫీల్డ్ మార్షల్ ’ అని సంబోధించారు.
‘ప్రధాని మోడీకి గుణపాఠం నేర్పించండి’ అని కోరారు. పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడానికి, కొత్త ఉగ్రవాద చొరబాటుకు రంగం సిద్ధం చేయడానికి రూపొందించిన మానసిక, కథన యుద్ధ ప్రచారం(నేరేటివ్ వార్‌ఫేర్)లో భాగంగా ఈ ప్రకటన చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. జమ్ము, పంజాబ్ సెక్టార్లలో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించాలని లాహోర్, బహవల్పూర్‌లోని లష్కరే విభాగాలకు ఆదేశాలు అందాయని నిఘా వర్గాలు సూచించాయి. రాబోయే దాడికి ‘పహల్గాం2’ అనేది కార్యాచరణ కోడ్‌నేమ్ అని సమాచారం. ప్రకృతి వైపరీత్యాలను భారత్ చేస్తున్న ‘యుద్ధచర్యలు’గా అభివర్ణిస్తూ, భారత వ్యతిరేక కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి లష్కరే తోయిబా కార్యకర్తలు మసీదులు, మదర్సాలు, ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.