ఆర్‌టిసి ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఆందోళన చేపట్టారు. ఆర్‌టిసి చార్జీల భారం ప్రయాణీకులపై ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు డి.సుధీర్ రెడ్డి,కాలేరు వెంకటేష్,ముఠా గోపాల్ మంగళ వారం ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్‌టిసి బస్సులో ప్రయాణించారు. పెంచిన ధరల గురించి ప్రయాణికులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంఎల్‌ఎలతో కలిసి ప్రయాణీకులు నినాదాలు చేశారు. అసెంబ్లీ దగ్గర బస్సు దిగిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు బస్ స్టాప్‌లో మీడియాతో మాట్లాడారు. పెంచిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన బస్ ఛార్జీలతో పేదలపై నెలకు ఐదు వందల రూపాయల వరకు అదనపు భారం పడుతుందని వారు వాపోయారు.
సామాన్య ప్రజలపై చార్జీల మోతతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక సర్కార్ అని రుజువైందని వ్యాఖ్యానించారు.ఇప్పటికే వాహనాల పన్ను పెంచారు…మద్యం ధరలు పెంచారని మండిపడ్డారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చార్జీల పెంపునకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.చార్జీల పెంపుతో ఆర్‌టిసిని మరింత దివాళా తీసేలా కుట్ర పన్నారని ఆరోపించారు.బస్ పాస్ చార్జీలు పెంచి విద్యార్థులపై భారం మోపారని, ఇప్పుడు మళ్లీ చార్జీలు పెంచి అందరిపై అదనపు భారం మోపారని మండిపడ్డారు.మార్పు మార్పు అంటే సామాన్య ప్రజలపై అధిక భారం మోపడమేనా ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని, ఈ ప్రభుత్వంపై చార్జీలు దించేదాకా ఒత్తిడి పెంచుతుందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సుధీర్ రెడ్డి,కాలేరు వెంకటేష్,ముఠా గోపాల్ స్పష్టం చేశారు.