ఒకప్పుడు ప్రపంచంపై క్రైస్తవాన్ని బలవంతంగా రుద్దిన ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం అక్కడ తగ్గుముఖం పడుతూ ఉంది. క్రైస్తవాన్ని పాటించే జనాభా శాతం అక్కడ వేగంగా మారిపోతూ ఉంది. ఒకప్పుడు అది పూర్తి క్రైస్తవ దేశం. ఇటీవలి కాలం దాకా అక్కడ అరవై శాతం క్రైస్తవులు ఉండేవారు. ఆ శాతం కిందికి పడిపోయి, ప్రస్తుతం అక్కడ నలభైఆరు శాతం మాత్రమే ఉన్నారు. ఏ మతాన్నీ పాటించని వారి సంఖ్య ఇంగ్లాండ్‌లో గణనీయంగా పెరుగుతూ వుంది. ఇటీవలి కాలంలో 25.2 శాతం ఉన్న మానవవాదుల శాతం 37.2కు పెరిగింది. మరో పదేళ్లలో ఈ శాతం ఇంకా పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అదే నిజమైతే, ఇంగ్లాండ్‌లో క్రైస్తవులు మైనారిటీలో పడిపోయే అవకాశం ఉంది. ఇలా చెప్పుకోవాలంటే మరో తాజా ఉదాహరణ ఉంది. క్రీస్తు జన్మ స్థలంలోనే క్రైస్తవం తగ్గుముఖం పడుతూ ఉంది.
రెండు వేల సంవత్సరాల క్రితం బెత్లెహామ్‌లో ఏసుక్రీస్తు జన్మించాడనీ, అక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవం వ్యాపించిందనీ ఒక అభిప్రాయం ఉంది. అది కూడా చాలా బలంగా ఉంది. అయితే ఆ బెత్లెహామ్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో కాకుండా పాలస్తీనా ఆక్రమించిన ప్రాంతంలో ఉంది. అక్కడి ప్రధానమైన చర్చిల తాళాలు రెండు ముస్లిం కుటుంబాల దగ్గర ఉంటాయి. ఉదయం వచ్చి తెరవడం, మళ్లీ రాత్రికి వచ్చి మూయడం వారే చేస్తారు. ఆ మధ్య కాలంలో అక్కడి ఆరు క్రైస్తవ వర్గాలు వంతుల వారీగా తమ ఆధ్యాత్మిక సేవల్ని కొనసాగించుకుంటూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే, అక్కడ మరో విచిత్రం కూడా జరుగుతూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు బెత్లెహామ్‌కు వచ్చి, ఏసు జన్మస్థలాన్ని దర్శించుకుని వెళ్లొచ్చు. వారికి వీసాలు సులభంగా దొరుకుతాయి కూడా! కానీ, స్థానికంగా ఉన్న క్రైస్తవులకే అక్కడి ప్రధాన చర్చిలలోకి అనుమతి లేదు. అది పాలస్తీనా ఆక్రమిత ప్రాంతం కాబట్టి, అక్కడ ఆ విషయంలో రాజకీయ కారణాలు పని చేస్తూ ఉండొచ్చు. ఏసు నడయాడిన ప్రాంతం ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదాల్లో, యుద్ధంలో నలుగుతూ ఉంది. ఇది జగద్విదితం!
బెత్లెహామ్‌లోని ఏసుక్రీస్తు జన్మస్థలమని భావిస్తున్న నేటివిటీ చర్చ్, జెరూసలేంలో ఏసును శిలువ వేశారని భావిస్తున్న చోట ఉన్న హోలీ సెవల్చర్ చర్చి ఈ రెండూ క్రైస్తవుల ప్రధాన చర్చ్‌లు, ఈ రెండు చర్చ్‌ల తాళాలే అక్కడి రెండు ముస్లిం కుటుంబాల ఆధీనంలో ఉన్నాయి. ఈ రెండు చర్చ్‌ల మధ్య ఉన్న ‘స్టార్ స్ట్రీట్స్’ (వీధు)లన్నీ వేల ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి. కాబట్టి, ఇప్పుడు అవి మరీ ఇరుకుగా, అసౌకర్యంగా అయిపోయాయి. అమితమైన భక్తిశ్రద్ధలున్న వారు తప్ప, మామూలు వారు ఆ వీధుల్లో తిరగాలంటే ఇబ్బందిపడతారు. ఒక రకంగా ఇష్టపడరు. ఇవీ అక్కడి పరిస్థితులు. అయితే ఇప్పుడక్కడ క్రైస్తవానికి తీవ్రమైన విఘాతం కలిగింది. ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు అక్కడ క్రైస్తవుల జనాభా ఎనభై శాతంగా నమోదయింది. ఇప్పుడు అది పన్నెండు శాతానికి పడిపోయింది. ఏసు జన్మించాడని భావిస్తున్న చోటే క్రైస్తవం అంతరించిపోవడం ప్రపంచం ప్రత్యక్షంగా చూస్తూ ఉంది. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని ఇలా ఉన్నాయని పరిశీలకులు చెపుతున్నారు.
1. ప్రపంచ వ్యాప్తంగా మతాల పట్ల ప్రజల్లో ఏర్పడిన విముఖత. 2. మతం నేపథ్యంలో వచ్చే పండగలంటే ఆసక్తి లేకపోవడం ఒకవేళ జరుపుకుంటున్నా, ఏదో ఒక ఫార్మీలిటీగా, యథాలాపంగా జరుపుకోవడం. 3. అక్కడి యువత మెరుగైన అవకాశాల కోసం యూరోపు, మధ్యప్రాచ్యదేశాలకు, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లడం జరుగతూ ఉంది. 4. ఆక్రమణ, వలస, నిత్యం తనిఖీలతో స్థానికులు విసుగెత్తిపోతున్నారు. 5. పై కారణాల ప్రభావం అక్కడి జన జీవితం మీద ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా జనాభా తగ్గిపోతూ ఉంది. 6. క్రైస్తవుల సంఖ్య తగ్గిపోవడం వల్ల, అక్కడ క్రైస్తవం గడ్డు రోజుల్ని ఎదుర్కొంటూ ఉంది.
క్రిస్‌మస్ వచ్చిందంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్రైస్తవుడూ తన ఇంటి మీద ఒక నక్షత్రాన్ని (మోడల్) ప్రత్యేకంగా అలంకరించుకుంటాడు. రంగు రంగులుగా అది వెలుగుతూ ఉండే విధంగా విద్యుత్ దీపాలు కూడా అలంకరించుకుంటాడు. కారణం ఏమంటే ఏసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిగిందీ అనే దానికి అది సంకేతం! అంతేకాదు, ఏసు తమ ఇంట్లోనే జన్మించాడని గర్వంగా ప్రకటించుకోవడానికి కూడా అది సంకేతం! ఆకాశంలో ఉండే నక్షత్రం తమ కోసం ఏసుగా జన్మించాడని కూడా క్రైస్తవుల భావన! భావనలు సరే కాని, ఏవైనా చారిత్రక ఆధారాలున్నాయా అంటే లేవు. రోమన్, ఈజిప్టు, గ్రీక్, మెసపటోమియా మొదలైన ప్రాచీన నాగరికతల్లోని జానపద మత సాహిత్యంలో అద్భుత శక్తులను ప్రదర్శించే కల్పిత పాత్రల పుట్టిన రోజు సామాన్యంగా డిసెంబర్ 25 అనే ఉంది. దాని దృష్టిలో ఉంచుకుని, అనేక చర్చోప చర్చలు, తర్జనభర్జనల అనంతరం క్రీస్తు జీసస్ పుట్టిన రోజును కూడా డిసెంబర్ 25 నే నిర్ణయించారు. అదే క్రిస్టమస్ అయ్యింది.
సాధారణ శకానికి ముందు పుట్టిన అరిస్టాటిల్, ప్లేటో వంటి వారి వివరాలు చరిత్రకు అందుతుండగా, దేవుడి కుమారుడు, పాపుల రక్షకుడు అని భావించే ఏసుక్రీస్తు వివరాలు లభించకపోవడం విచిత్రంగా ఉంది. ఇక ఏసు చారిత్రక వ్యక్తి అని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు జోసెఫస్ (Josephus) అని చెపుతున్నారు. కాని, నిజంగానే ఆయన ఏసును చారిత్రక వ్యక్తి అని అన్నాడా? అనుమానమే! ఎందుకంటే అందుకు ఆధారాలే లేవు. Josephus మాత్రమే గాక, ఇంకా చాలా మంది ఏసును చారిత్రక వ్యక్తి అని అన్నారని కొందరు బుకాయిస్తుంటారు. బుకాయింపు అని అన్నది ఎందుకంటే వారెవరూ తగిన ఆధారాలు చూపలేదు. పైగా వీరెవరూ ఏసుకు సమకాలీనులు కాదు. తర్వాత కాలంలో జీవించిన వారు. చాలా మందికి తెలియని విషయమేమంటే సాధారణ శకం 354 (సిఇ) దాకా ‘క్రిస్టమస్’ ఉనికిలో లేదు. అలాగే సాధారణ శకం 786 దాకా ప్రపంచ దేశాలలో ఒక్కడ క్రీస్తు పూర్వం/ క్రీస్తు శకం అనే సంక్షిప్త రూపాలు వాడుకలో లేవు. (వీటిని మనం ఇప్పుడు బిసిఇ/ సిఇ గా వాడుతున్నాం) అమెరికాలోని కొన్ని క్రైస్తవ శాఖల్లో క్రిస్ట్‌మస్ జరుపుకోవడంపై సా.శ. 1836 కు ముందు నిషేధం ఉండేది. క్రిస్ట్‌మస్ జరుపుకోవడాన్ని తప్పుపట్టే క్రైస్తవ మత శాఖలు ఇప్పటికీ అక్కడక్కడా ఉన్నాయి. ఇలాంటి విషయాల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు. క్రైస్తవులు కాని ఇతర మతస్థులు కూడా వేలం వెర్రిగా క్రిస్ట్‌మస్ జరుపుకుంటూ ఉంటారు. అయితే అది ఒక ‘గెట్ టు గెదర్’గా సరదాగా గడపడం కోసం వినియోగిస్తారు. వారి పవిత్ర మత గ్రంథాల్లోని ఇలాంటి విషయాల్ని జీర్ణించుకుని కొందరు క్రైస్తవ బ్రిటీష్ రచయితలు భారత దేశం మొగలుల పాలనలో ఉన్నప్పుడు నిరాధారమైన విషయాల్ని గ్రంథస్థం చేశారు. మొగలు చక్రవర్తులకు ఒక్కొక్కరికి వెయ్యి, పదిహేను వందల మంది భార్యలుంటారని, వారికి స్వేచ్ఛ ఉండదని, వారు భవనాల్లోనే మగ్గిపోతుంటారని, వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా కాకుండా, స్త్రీలని కేవలం భోగ వస్తువులుగా చూశారని రాశారు. మొగలు రాజులు మద్యానికి, జూదానికి, స్త్రీలోలత్వానికీ బానిసలని రాశారు. నిజాయితీగా నిజాల్ని నమోదు చేసిన ఆనాటి చరిత్రకారులు, ఆధునిక చరిత్ర పరిశోధకులు తేల్చిన విషయాలు వేరే విధంగా ఉన్నాయి. మొగల్ మహిళలు ఎవరూ అనైతిక చర్యలకు పాలు పడలేదని, చాలా మంది స్త్రీలు విద్యావంతులని, కొందరు రచయిత్రులు కూడా అయ్యారని తేల్చిచెప్పారు. అంతేకాదు, అనుభవజ్ఞులైన మహిళలు పరిపాలనా వ్యవహారాలలో చక్రవర్తులకు సలహాలిచ్చేవారని, కొందరు అంతర్జాతీయ స్థాయిల్లో వ్యాపారాలు సాగించారనీ పూర్తి ఆధారాలతో రుజువు చేశారు. ఓర్వలేని తనంతోనూ, ఎదుటి వారిని తక్కువ చేసి చూపాలని ప్రయత్నించే వారి రాతల్ని, ప్రచారాల్ని మనం పట్టించుకోకూడదు. నిదానంగా నిజాల్ని తవ్వి బయటికి తీసుకోవాలి!
డాక్టర్ దేవరాజు మహారాజు