బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ఏకంగా రూ.9,700 పెరిగి 10 గ్రాములు రూ.1,30,300కు చేరిం ది. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు, రూపాయి విలువ తగ్గడమే ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు తెలిపారు. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్చత బంగారం ధర శుక్రవారం 10 గ్రాములు రూ.1,20,600 వద్ద ముగిసింది. స్థానిక బులియన్ మార్కెట్‌లో 99.5 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.2,700 పెరిగి రికార్డు స్థాయిగా రూ. 1,22,700కు చేరింది. గత మార్కెట్ సెషన్‌లో ఇది రూ. 1,20,000 వద్ద ఉంది. ఈ పెరుగుదలపై హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ స్పందిస్తూ, రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నప్పటికీ పెట్టుబడిదారులు ఇప్పటికీ పసిడిపై ఆసక్తి చూపుతున్నారు, ఈ కారణంగానే సోమవారం బంగారం ఆల్‌టైమ్ హైకి చేరిందని అన్నారు. డిమాండ్ వల్ల రాబోయే రోజుల్లోనే పెరిగే అవకాశముందని ఆయన అన్నారు. ఇక సోమవారం నాడు వెండి కూడా బాగా పెరిగింది. వెండి 1 కిలోకు రూ. 7,400 పెరిగి రూ.1,57,400కు చేరింది. ఇది శుక్రవారం రూ.1,50,000 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఒక ఔన్స్‌కు 2 శాతం పెరిగి 3,949.58 డాలర్లకు, వెండి ఒక ఔన్స్ 1 శాతం పెరిగి 48.75 డాలర్లకు చేరింది.
మరింత పెరిగే అవకాశం : విశ్లేషకులు
గ్లోబల్ మార్కెట్‌లో ఒడిదుడుకులు, వాణిజ్య యుద్ధాల భయం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, కరెన్సీ బలహీనతలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. పరిశ్రమ అవసరాలు, సరఫరా లోపం కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భారత దేశంలో వచ్చే పండుగ సీజన్ బంగారం, వెండి ధరలను మరింత పెంచగలదని భావిస్తున్నారు. దీపావళి, పెళ్లిళ్లు వంటి సాంప్రదాయ సందర్భాలు బంగారం, వెండికి భారీ డిమాండ్‌ను కలిగిస్తాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, అక్టోబర్ నెలలో ఈ విలువైన లోహాల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.