భారతదేశంలో అన్ని రకాల వనరులు ఉన్నా, సంపద సృష్టికి అవకాశాలు ఉన్నా మేధో వలసలు దేశాభివృద్ధికి శాపంగా మారిపోయాయి. ఒకప్పుడు తన శక్తియుక్తులు వినియోగించుకోవాలంటే తగిన శాస్త్రవిజ్ఞానం, వనరులు మాతృదేశం సమకూర్చలేదు కనుక శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉన్నత విద్య అవసరార్థులు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన, వనరులు పుష్కలంగా ఉన్న దేశాలను ఆశ్రయించేవారు. దానినే మేధోవలసగా మనం ముద్దు పేరు పెట్టుకున్నాం. 21వ శతాబ్దం ఆరంభంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనబడే ఆధునిక మార్పులు తర్వాత మేధోవలసలు పేరుతో, విద్య పేరుతో, ఉద్యోగాల పేరు విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒక రకంగా నేటి యువతకు విదేశాల్లో స్థిరపడడం అనేది ఒక హోదాగా, సామాజిక స్టేటస్‌గా భావించే ఒక స్థితికి నేడు విదేశీ వలసలు చేరిపోయాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ లాంటి వారు హెచ్ 1బి వీసాదారులు కోటి రూపాయలు రుసుంగా చెల్లించాలని అసాధారణ ఉత్తర్వులు ఇవ్వడం, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కీలక దేశాల్లో విదేశీ వలసలు, ముఖ్యంగా భారతీయ వలసదారులపట్ల ప్రదర్శనలు జరపడం, అసహనం వ్యక్తం చేయడం జరుగుతున్న నేపథ్యంలో దేశ యువత విదేశీ వలసలపై ఒక ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఒకనాడు మేధోవలసస్థితి నుండి నేడు సాధారణ జీవనవలసలు వరకు చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంతరిక్ష పరిశోధనలు, శాస్త్రవిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, కంప్యూటర్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు, ఐటి, ఎఐ లాంటి టెక్నాలజీ పరాయి దేశాల్లో అభివృద్ధి చేస్తున్న భారతీయుల సంఖ్య ప్రస్తుతం అధికంగానే ఉంది. ప్రపంచీకరణవల్ల నేడు ప్రపంచం ఒక కుగ్రామం గా మారిన సాంకేతిక స్థితిలో వలసలు సర్వసాధారణం కావచ్చును. కానీ, అధిక జనాభా, యువశక్తి, పునరుత్పత్తి అధికంగా ఉన్న భారతీయ సమాజం కు వలసలు ఒకరకంగా శాపంగా పరిణమించే అవకాశం ఉంది.
ఈ భూమిపై పుట్టి, ఈ మట్టిలో పెరిగి, తీరా పరిపూర్ణమైన జ్ఞానవంతుడుగా భారతీయ సమాజం తీర్చిదిద్దిన తర్వాత తమ సేవలు ఇతర దేశాలకు అందించడం అంటే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను అనాథశ్రయంలోనో, వీధుల్లోనో వదిలేసిన పుత్ర ఉత్తముల చందమే తప్ప మరొకటి కాదు? ఇప్పటికే 3 కోట్ల 54 లక్షల మంది భారతీయులు వివిధ దేశాల్లో వలసజీవులుగా పరాయి పంచన జీవిస్తున్నారు. అంతేకాదు కెనడా లాంటి దేశాల్లో పార్లమెంటు సభ్యులుగా కూడా భారతీయులు పెద్ద సంఖ్యలో ఎన్నిక కావడం చూస్తే ఆధునిక వలస స్థితిని ఆ రాజకీయ ప్రాధాన్యత గుర్తు చేస్తుంది. వివిధ దేశాల్లో జీవిస్తున్న భారతీయ వలసదారుల స్థితి ఈ విధంగా ఉంది.
అమెరికా- 51.6 లక్షలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ -44.3 లక్షలు, సౌదీ అరేబియా -26 లక్షలు, మలేసియా -20 లక్షలు, మయన్మార్ -20 లక్షలు, కెనడా- 18.6 లక్షలు, యునైటెడ్ కింగ్డమ్ -19.3 లక్షలు, దక్షిణఆఫ్రికా -17లక్షలు, ఓమన్ -13.8 లక్షలు, ఆస్ట్రేలియా -83 వేలు, ఇంకా చిన్నాచితకా దేశాలన్నింటా వివిధ స్థాయిల్లో, సంఖ్యలో భారతీయ వలసలు ఉన్నాయి.
ఒకప్పుడు మేధోవలసలు మాత్రమే ఉన్న స్థితినుండి నేడు దేశంలో పాలకులు అనుసరిస్తున్న సరళీకృత విధానాలు మూలంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లభ్యం కాకపోవడం, రూపాయి విలువ రోజురోజుకు కుంచించుకుపోవడం, వ్యాపారం, పారిశ్రామిక సంబంధాలు దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోవడం, సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సౌకర్యాలు వేగంగా విస్తరించడం, ఉచితమైన నాణ్యమైన విద్య, వైద్యం దేశంలో గగన కుసుమం కావడం, నైతికతతో కూడుకున్న విశ్వసనీయమైన రాజకీయ వ్యవస్థ లేకపోవడం, నేడు విదేశీ వలసలు విపరీతంగా పెరగడానికి కారణం అవుతుంది. ఫలితంగా మన దేశం అబివృద్ధి కుంటుపడడమే కాకుండా సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులుకు లోనవుతున్నది. ఒకప్పుడు స్వయం పోషక పటిష్టమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ విదేశీ వలసలు మూలంగా సంక్షోబిత స్థితికి చేరుకుంటున్నది. ఉదాహరణకు తెలుగు రాష్ట్ర పల్లెల్లో ఇప్పటికే 20 శాతం ఇండ్లకు తాళం కప్పులు వేలాడుతున్నాయి. రైతుల పిల్లలు ఉద్యోగాల పేరుతో విదేశాలకు వలసలు వెళ్ళడం, రైతులు పట్టణాలకు వలస వెళ్ళడం, ఫలితంగా కౌలు వ్యవసాయదారులు సంఖ్య గ్రామాల్లో పెరగడం, గిట్టుబాటు ధరల క్షీణత పట్ల, వ్యవసాయ రంగం పట్ల అనాసక్తి భవిష్యత్తు దేశ ఆహార సంక్షోభిత స్థితిని చెప్పకనే చెబుతున్నది. అంటే విదేశీ వలసలతో క్రమంగా పల్లెసీమలు వట్టిపోతున్నాయని అర్థం. ఇక రెండో అంశానికి వస్తే ఇది చాలా దారుణమైన స్థితి. ఒక్కో ఐఐటి విద్యార్థిమీద కేంద్ర ప్రభుత్వం ఏటా నాలుగు లక్షలు చొప్పున, ఒక్కో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ బయటకు రావడానికి కనిష్టంగా 24 లక్షలు ఖర్చు పెడుతుంది.
ఒక్కో ప్రభుత్వ సంస్థలో ఎంబిబియస్ పూర్తికావడానికి ఒక్కో విద్యార్థిపై 1.7 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తే, అదే ప్రైవేటు సంస్థల్లో అయితే 1.95 కోట్లు రూపాయలు తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. అంతెందుకు సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ విద్య కోసం సైతం పెద్ద మొత్తమే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఇదంతా ప్రజల పన్నుల నుండి వచ్చే సొమ్ము మాత్రమే! అంటే, ప్రజల సొమ్ముతో పరిపూర్ణమైన పరిజ్ఞానం పొందిన మనం, మన ప్రజలకు ఉపయోగపడకుండా, దేశాభివృద్ధిలో భాగస్వాములు కాకుండా ఎయిర్‌బస్‌లపై కృత్రిమ రెక్కలతో ఎగిరిపోయి, పరాయి పంచన వ్యక్తి గత స్వార్థాలతో జీవించడం, మన యువశక్తిని, శ్రమ శక్తిని మనమే నిర్వీర్యం చేసుకున్నట్లు కాదా? యువత ఆలోచించాలి. అదే విధంగా ప్రభుత్వాలు కూడా ఉత్పత్తి అవుతున్న యువతకు, తమ మేధకు తగ్గ పని అప్పగించడంలో బాధ్యతగా, చిత్తశుద్ధిగా వ్యవహరించాలి.
మన శక్తిని మనమే నిర్వీర్యం చేసుకునేలా ప్రభుత్వాలు వైఖరి ఉండరాదు. యువశక్తిని సద్వినియోగం చేసుకొని జనాభాలోనే కాదు! అన్ని రంగాల్లో ముందు ఉండేలా, స్వయం సమృద్ధి, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ప్రభుత్వరంగంలో పని అవకాశాలు యువతకు పెంపొందించాలి. మన పురాతన వైద్యం, శాస్త్రవిజ్ఞానం ప్రపంచ చరిత్రలో ఘనంగా ఉంది. సర్ సివి రామన్, అరగోవింద్ ఖురానా, అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలు, రామానుజన్, శకుంతలా దేవి లాంటి గణిత దిగ్గజాలు, స్వామి వివేకానంద లాంటి సామాజిక వేత్తలు వీరే యువతకు ఆదర్శం. కనుక ఆధునిక యువత కూడా దేశం కోసం పని చేయడమే నిజమైన దేశభక్తి అనే కోణంలో ఆలోచించాలి. ఇప్పటికైనా యువత విదేశాల్లో ద్వితీయ జాతి పౌరులుగా ఎదురవుతున్న అవమానాలు దిగమింగుకొని బతకడం కన్నా మాతృభూమి సేవలో తరించడం మిన్నగా, ఆత్మగౌరవంగా భావించాలి. పుట్టి పెరిగిన గడ్డకు సేవలు అందించాలి. ఒక వైపు ఆధునిక యువత, మరోవైపు ఆధునిక ప్రభుత్వాలు ఈ విషయంలో లోతైన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేధో వలసలు, విదేశీ వలసలు అరికడదాం. స్వదేశ అభివృద్ధికి నూతన బాటలు, ప్రణాళికలు ఆశిద్దాం. —
ఎన్. తిర్మల్, 94418 64514