మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంపై రుణాల భారం పెరుగుతోంది. పాత అప్పులు, కొత్త బడ్జెట్‌లో తీసుకోబోయే అప్పులు కలిపి తడిసిమోపెడవుతున్నాయి. చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్ర భుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బడ్జెట్ నిర్వహణ పరిమితులను అప్పుల ద్వారా అధిగమించింది. ఎఫ్‌ఆర్‌బిఎం కింద ఆమోదించిన రుణ అంచనాలకు మించి అదనంగా రూ.5, 500 కోట్లు అప్పు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైం ది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా క్యాలెండర్ ప్రకారం 2025-26 ఆర్థిక సం వత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య రూ. 9,600 కోట్లు రుణం తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రం ఇప్పటికే మొదటి రెండు త్రైమాసికాల్లో (మొదటి ఆరు నెలల్లో) రూ. 49,900 కోట్లు రుణం తీ సుకుంది. ఇది వార్షిక రుణ పరిమితి అయిన రూ. 54,009 కోట్లలో 92 శాతానికి పైగా ఉంది. దీం తో ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి కే వలం రూ. 4,109 కోట్లు మాత్రమే రుణం తీసుకు నే అవకాశం ఉండేది.
కానీ తాజా ప్రతిపాదనతో డిసెంబర్ చివరి నాటికి మొత్తం మార్కెట్ రుణాలు రూ.59,500 కోట్లకు చేరుకుంటాయి. రాష్ట్ర ప్ర భుత్వ ఈ చర్యకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమో దం లభించింది. 2025- 26 సంవత్సరానికి అం చనాల కన్నా అదనంగా రూ. 15వేల కోట్లు రుణం తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అసాధారణంగా అనుమతి ఇచ్చింది. ఈ పరిణామంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం అనుమతించదగిన రుణం రూ. 69,000 కోట్లకు చేరింది. ప్రభుత్వ అనియంత్రిత రుణాలు, తగ్గుతున్న జిఎస్‌టి వసూళ్లు , ఆదాయ స్థిరీకరణ లేకపోవడం వంటివి ఆర్థిక ఇబ్బందులను, బలహీనమైన ఆర్థిక నిర్వహణను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ రుణాలు పెరిగితే తిరిగి చెల్లింపులు, వడ్డీ భారం ప న్ను చెల్లింపుదారులపై పడుతుందని, ఇది అభివృ ద్ధి పనులపై ఖర్చును తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన 22 నెల ల్లో రూ.2.43 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) రెం డో త్రైమాసికంలో (జూలై- సెప్టెంబర్ మధ్య) కేవలం రెండున్నర నెలల్లోనే ప్రకటించిన మొత్తం కంటే రెట్టింపు అప్పులు తీసుకువచ్చారు. ఈ త్రైమాసికంలో సెక్యూరిటీల ద్వారా రూ.12 వేల కోట్లు సమీకరించాలని ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం సెప్టెంబర్ 30 నాటికి ఏకంగా రూ.32,500 కోట్ల అప్పులు తీసుకుంది. ప్రభుత్వం తాజాగా రిజర్వు బ్యాంక్ నుంచి మరో రూ.4 వేల కోట్ల అప్పు తీసుకుంది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 27 ఏండ్ల కాలానికి 7.53 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 29 ఏండ్ల కాలానికి 7.52 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 31 ఏండ్ల కాలానికి 7.44 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 33 ఏండ్ల కాలానికి 7.44 వార్షిక వడ్డీతో మరో రూ.1,000 కోట్లు తీసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202526)లో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం తాజా రుణంతో కలిపి తొలి 6 నెలల్లోనే (ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలోనే) రూ.49,900 కోట్ల అప్పు తీసుకున్నట్లయింది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యంలో దాదాపు 92 శాతానికి సమానం. ఇందులో ఏకంగా రూ.16 వేల కోట్ల రుణాలను ఈ నెలలోనే సమీకరించడం ద్వారా ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో మిగిలిన 6 నెలల్లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.4,109 కోట్ల రుణాలు మాత్రమే సమీకరించేందుకు వీలుంది. 202526లో తీసుకునే అప్పులతో కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రాష్ట్ర అప్పు రూ.5,04,814 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో 28.1 శాతంగా ఉండనుంది. ఈ మొత్తం అప్పులో బహిరంగ మార్కెట్ రుణాలు రూ.4,07,059 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.23,719 కోట్లు, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల రుణాలు రూ.11,202 కోట్లు, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి రూ.21,787 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్ ఫండ్ రూ.41,048 కోట్లుగా ఉన్నాయి. ఇవి కాకుండా ఎఫ్‌ఆర్‌బీఎంకు ఆవల కూడా కార్పొరేషన్ల పేరిట అప్పులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి కార్పొరేషన్ల అప్పులు మొత్తం రూ.3,01,484 కోట్లుగా ఉన్నాయని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇందులో కార్పొరేషన్ల కోసం ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చి, ప్రభుత్వమే స్వయంగా చెల్లించే అప్పులు రూ.1,17,109 కోట్లు కాగా, ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్లు తీసుకుని, కార్పొరేషన్లే చెల్లించే రుణాలు రూ.1,24,419 కోట్లు అని వివరించింది. ఇవే కాకుండా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు రూ.59,956 కోట్లు అని పేర్కొంది. ఇలా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పు రూ.5,04,814 కోట్లు, కార్పొరేషన్ల కోసం సేకరించిన అప్పు రూ.3,01,484 కోట్లు కలిపి మొత్తం అప్పు రూ.8,06,298 కోట్లుగా తేలుతోంది.
ఇక మిగిలింది రూ.4,109 కోట్లే : ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.64,539 కోట్ల రుణాలు తెస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం అందులో రూ.54,009 కోట్లు ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా సమీకరించాలని నిర్ణయించింది. తొలి 6 నెలల్లోనే రూ.49,900 కోట్ల అప్పు తీసుకుంది. ఇది వార్షిక రుణ లక్ష్యంలో దాదాపు 92 శాతానికి సమానం. దీంతో మిగిలిన 6 నెలల్లో రూ.4,109 కోట్ల రుణాలు మాత్రమే సమీకరించాల్సి ఉంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరిన్ని రుణాలు అవసరమని తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నెల (అక్టోబరు) నుంచి డిసెంబరు వరకు 3 నెలల్లో దశలవారీగా రూ. 9,600 కోట్ల రుణాలు సేకరించనుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుందని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న రుణాలు బడ్జెట్ అంచనాలను మించనున్నాయి. మొత్తం రూ. 54,009 కోట్ల కొత్త రుణాలు సేకరించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది తొలి అర్ధ భాగం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు) లోనే రూ.48 వేల కోట్లు సేకరించింది. పాత రుణాల చెల్లింపులకు తీసుకునేవాటిని ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యమైన రూ.54 వేల కోట్లలో కలపవద్దని రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. అధిక వడ్డీలకు తీసుకున్న రూ.30 వేల కోట్ల పాత బాకీలను పూర్తిగా తీర్చేస్తే వడ్డీల భారం తగ్గి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసమే రుణాల సమీకరణ పెరగనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జీఎస్‌టి ఆదాయంలో లోటును కేంద్రం పూడ్చకపోతే జీఎస్టీ శ్లాబుల సవరణతో బడ్జెట్ అంచనా వేసిన దానికన్నా రూ.7 వేల కోట్ల వరకు పన్నుల ఆదాయం తగ్గవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
పెరుగుతోన్న జీతాలు, పెన్షన్ల వ్యయం
తెలంగాణ ప్రభుత్వం వివిధ కేటగిరీల ఉద్యోగులకు చెల్లించే జీతాలు, పెన్షన్ల వ్యయం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఎన్. శివ శంకర్ నేతృత్వంలోని రెండవ వేతన సవరణ కమిషన్‌పై ప్రభుత్వం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. 2014-15లో రూ 14,849 కోట్ల నుంచి 2022 23లో రూ 41,495 కోట్లకు జీతాలు, పెన్షన్ల వ్యయం పెరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం, 2022-23లో పే రోల్స్‌లో ఉన్న ఉద్యోగుల జీతాల బిల్లు రూ. 25,769 కోట్లుగా ఉంది. అదే సంవత్సరంలో పెన్షన్ల కోసం మరో రూ. 15,816 కోట్లు ఖర్చయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదైన 2014-15లో రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు రూ. 10,639 కోట్లు ఉండగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన భారీ ఫిట్‌మెంట్ కారణంగా 2015-16 నాటికి ఇది దాదాపు రెట్టింపై రూ. 18,065 కోట్లకు చేరింది. అదే కాలంలో పెన్షన్లు కూడా రూ. 4,210 కోట్ల నుంచి రూ. 8,217 కోట్లకు పెరిగాయి. రిటైర్డ్ అధికారి సి.ఆర్. బిస్వాల్ చేసిన పిఆర్‌సి సిఫారసులను ప్రభుత్వం అమలు చేయడంతో 2021-22 , 2022- 23 మధ్య జీతాలు,
పెన్షన్ల చెల్లింపుల్లో మరో భారీ పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో జీతాలు రూ. 22,150 కోట్ల నుంచి రూ. 25,679 కోట్లకు, పెన్షన్లు రూ. 14,025 కోట్ల నుంచి రూ. 15,816 కోట్లకు పెరిగాయి. ఈ పెరిగిన జీతాలు, పెన్షన్ల వ్యయం వర్క్-ఛార్జ్ సిబ్బంది, గ్రాంట్- ఇన్ -ఎయిడ్ ఉద్యోగులు, హోంగార్డులు, దినసరి కూలీలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వంటి వారికి చేసే చెల్లింపులకు అదనం. ప్రణాళికా శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 9.16 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5.7 లక్షల మంది పే రోల్ ఉద్యోగులు, పెన్షనర్లు కాగా, 3.6 లక్షల మంది ఇతరులు ఉన్నారు. గత ఏడాది నుంచి వివిధ పోస్టులకు నియామకాలు జరుగుతున్నందున రానున్న రోజుల్లో జీతాల చెల్లింపుల భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ వాస్తవ నియామకాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్. శివ శంకర్ నేతృత్వంలోని పిఆర్‌సి నివేదిక జూలై 1, 2023 నుంచే అమలు కావాల్సి ఉండగా దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.