న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విచారణ స మయంలో భారత ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కూర్చున్న డ యాస్ వద్దకు ఓ న్యాయవాది వెళ్లి తన బూటు తీసి సిజెఐ వైపు విసిరాడు. అయి తే అది సిజెఐ డయాస్‌కు దూరం గా ప డింది. ఊహించని ఈ పరిణామం తో అ క్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ లో భాగంగా వాదనలు జరుగుతుండ గా, ఓ న్యాయవాది సీజేఐ పైకి బూటు విసిరేందుకు ప్రయత్నించగా, గమనించిన భద్రతా సిబ్బది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ సంఘటనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ ఇలాం టి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. అనంతరం తన విచారణను కొనసాగించారు. ఈ సంఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదు పులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ న్యాయవాది కిషోర్ రాకేశ్‌గా గుర్తించా రు. కోర్టు రూమ్ నుంచి బయటకు తీసుకెళ్తున్న సమయంలో ఆ న్యాయవాది సనాతన ధర్మంపై నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. సనాతన్ కా అప్మాన్ నహీ సహింగే… సనాతన ధర్మాన్ని అవమాని స్తే సహించేది లేదని ఆ న్యాయవాది అ న్నారు. గతంలో ఖజురహో కేసు తీర్పు సమయంలో గవాయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిం దే. సీజెఐ మాత్రం ఎలాంటి అధైర్యానికి లోనుకాలేదు. కోర్టులో ఉన్న లాయర్లను తమ
వాదనలు కొనసాగించాలని కోరారు. ఇలాంటి వాటివల్ల ఎవరూ విచలితులు కావొద్దు అని, తామేమీ చలించడం లేదని, పేర్కొన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సీజేఐ గవాయ్ ఓ కేసులో చేసిన వ్యాఖ్యల వల్లనే ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఖజురహో లోని ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని పునర్ ప్రతిష్ఠించాలని దాఖలు చేసిన కేసులో సీజేఐ గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ కేసును ఆయన డిస్మిస్ చేస్తూ వెళ్లి ఆ దేవుడినే అడుక్కోవాలన్న వ్యాఖ్యలు చేశారు. విష్ణువుకు వీరభక్తుడిని అని చెప్పుకుంటున్నావు కదా, వెళ్లి ఆ దేవుడిని ప్రార్థించుకో, అదో ఆర్కియాలజీ సైట్ అని, దానికి ఏఎస్‌ఐ పర్మిషన్ అవసరం ఉంటుందని ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యానించారు. ఖజురహో కేసులో సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. మతపరమైన భావాలను కించపరిచినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వివాదానికి ఆయన తనదైన శైలిలో తెరదించారు. రెండు రోజుల తరువాత ఓ కేసులో స్పందిస్తూ తానేమీ ఏ మతాన్ని అమర్యాదపరచలేదన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానని, కేవలం సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు ప్రచారం అయినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐకి అండగా నిలిచారు. సోషల్ మీడియాల్లో కొన్ని సందర్భాల్లో ప్రతిచర్యలు భిన్నంగా ఉంటాయన్నారు.
దాడికి యత్నించిన లాయర్ సస్పెన్షన్
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్‌పై బూటుతో దాడికి ప్రయత్నించిన కిషోర్ రాకేశ్‌ను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. తక్షణం ఆయన లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో ఏ కోర్టులో కానీ, ట్రిబ్యునల్, లేదా లీగల్ అథారిటీలో కానీ తదుపరి క్రమశిక్షణ చర్య వరకు విధులు నిర్వహించరాదని ఆదేశించింది. ఈమేరకు ఆ న్యాయవాదికి సస్పెన్షన్ ఎందుకు కొనసాగించకూడదో , తదుపరి చర్య ఎందుకు తీసుకోకూడదో 15 రోజుల్లోగా స్పందించి సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీస్ జారీ చేయనుంది. ఎటువంటి ఆలస్యం కాకుండా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కావాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ ఆదేశించింది. అధికారిక జాబితాలోను ఆ న్యాయవాది ప్రస్తుత హోదా తెలియజేయడమే కాక, దేశం లోని అన్ని కోర్టులకు , ట్రిబ్యునళ్లకు ఈ సస్పెన్షన్ సమాచార ం అందించాలని ఆదేశించింది.
సీజేఐపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ప్రధాని మోదీ ఖండించారు. సిజేఐ కి స్వయంగా ఫోన్ చేసి, ఈ ఘటన పట్ల తన ఆవేదన ను ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రతిభారతీయుడినీ ఆగ్రహానికి గురి చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్ట్ పెడుతూ, సోమవారం ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంపై సిజేఐ పై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని, మన సమాజంలో ఇలాంటి దారుణ చర్యలకు చోటు లేదన్నారు. ఇది పూర్తిగా ఖండించదగినదని ఆయన పేర్కొన్నారు.కోర్టు విచారణ జరుగుతుండగా, ఓ సీనియర్ న్యాయవాది ప్రధాని న్యాయమూర్తి పై షూ విసిరారు. ఆ షూ బెంచ్ పై పడలేదు కానీ, కోర్టులో ఉన్న భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని బయటకు తీసుకుపోయారు.జస్టిస్ కె. వినోద్ చంద్రన్ తో కలిసి ధర్మాసనంలో కూర్చున్న సిజేఐ ఈ హఠాత్ ఘటనతో దిగ్భ్రమ చెందారు. సంయమనం పాటించాలని న్యాయవాదులను కోరారు. ఇలాంటి సంఘటనలు తనపై ప్రభావం చూపబోమని జస్టిస్ గవాయ్ చెప్పి, కేసు విచారణ కొనసాగించారు. సిజేఐ వైఖరి న్యాయవిలువల పట్ల ఆయనకున్న నిబద్ధతను రాజ్యాంగస్పూర్తిని బలోపేతం చేయడాన్ని హైలైట్ చేస్తుందని మోదీ పేర్కొన్నారు.