దుబాయ్: మహిళ వన్డే వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైన పాక్‌కు ఐసిసి గట్టి షాక్ ఇచ్చింది. ఆ జట్టు టాపార్డరర్ సిడ్రా అమిన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కమిటీ చర్యలు తీసుకుంది. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్రా ఐసిసి రూల్ 1 నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడంతో ఆమెకు డీమెరిట్ విధించింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 247 పరుగులకు లక్ష ఛేదనకు దిగిన పాక్ అదిలోనే 2 కీలక వికెట్లు కోట్పోయి కష్టాల్లో ఉన్న తరుణంలో క్రీజులోకి వచ్చింది సిడ్రా. మరో బ్యాటర్ నటాలియా ఫర్వైజ్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్‌ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె అర్ధ శతకం సయితం సాధించింది.
స్వీప్ షాట్లతో పాక్ స్కోర్డును ముందుకు నడిపించింది. అయితే భారత్ స్పిన్నర్ స్నేహ్ రానా వేసిన 40వ ఓవర్‌లో స్వీప్ షాట్ ఆడబోయి ఇండియా కెప్టెన్ హర్మన్‌కు క్యాచ్ ఇచ్చింది. దీంతో టీమిండియా సంబురాల్లో మునిగిపోగా.. సిడ్రా కోపంతో బ్యాట్‌ను పిచ్‌పై బలంగా కొట్టింది. దీంతో సిడ్రా తీరును తీవ్రంగా పరిగణించిన ఐసిసి రూల్1 ప్రకారం ఆమె మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు విధిస్తూ చర్యలు తీసుకుంది.