కోల్‌కతా: ఉత్తర బెంగాల్‌లో వరద భీభత్సతం మానవ సృష్టి అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ ప్రాంతాలలో నదులు పొంగిపొర్లడానికి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డివిసి) అపరిమితంగా నీటిని విడుదల చేయడమే కారణం అన్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడ్డంతో మరణించిన వారి బంధువులకు రూ. 5 లక్షల పరిహారం, మృతుల కుటుంబాలకు హోం గార్డు ఉద్యోగం కూడా అందిస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.
‘ఉత్తర బెంగాల్ వరదల్లో ఇప్పటి వరకు 23 మంది మరణించినట్లు మాకు నివేదికలు అందాయి. ఈ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు 12 గంటలకు పైగా 300 మిమీ. వర్షపాతం నమోదయింది’ అని ఆమె వివరించారు. వరదకు దెబ్బ తిన్న ప్రాంతాలలో సహాయం, కార్యకలాపాల పర్యవేక్షించడానికి బాగ్డోగ్రాకు బయలుదేరే ముందు ఆమె విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ అనేక విషయాలు ప్రస్తావించారు.