జైపూర్: జైపూర్‌లోని ప్రభుత్వ సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రి ట్రామా సెంటర్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు రోగులు మృతి చెందారని, మంటలు చెలరేగినప్పుడు 11 మంది రోగులు న్యూరో ఐసియులో చికిత్స పొందుతున్నారని ట్రామా సెంటర్ ఇన్‌ఛార్జ్ అనురాగ్ ధకాద్ తెలిపారు. షార్ట్ సర్కూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరణించిన వారిని పింటు(సికార్), దిలీప్(జైపూర్‌లోని అంధి), శ్రీనాథ్, రుక్మిణి, ఖుర్మా(భరత్‌పూర్), బహదూర్ (జైపూర్‌లోని సంగనేర్)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ‘ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు చనిపోయారు’ అని డాక్టర్ ధకాద్ తెలిపారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోగారం పటేల్, హోం శాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేధం ట్రామా సెంటర్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.