విద్యార్థుల జీవితానికి మంచి మార్కులు, గ్రేడులే ముఖ్యం కావని మానవతా విలువలు కూడా అంతే అవసరమని అన్నారు స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా ఆమె నేటి విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ “చదువుతో పాటు మంచి విలువలు ఉండేలా పిల్లలకు అన్ని రకాల విద్యలు నేర్పించాలి. ప్రస్తుతం విద్యార్దుల పడుతోన్న బాధలు, ఇబ్బందుల గురించి పత్రికల్లో , సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనిపిస్తోంది. నేను స్కూల్లో చదువుకుంటోన్న రోజుల్లో ఇలాంటివి ఏవీ లేవు. స్నేహం, దయ, సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలే నాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. మంచి మనిషిగా ఎలా ఉండాలో పాఠశాల నేర్పిస్తుంది. స్కూల్లో నేర్చుకున్నవే జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో సహకరిస్తాయి. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలబడే ధైర్యాన్ని కూడా పాఠశాల దశ నుంచే పిల్లలు అలవాటు చేసుకోవాలి. ఇలాంటి అంశాలతో కూడిన పాఠ్యాంశాలను జోడిస్తే బాగుంటుంది”అని పేర్కొంది.