తల్లిదండ్రులను కుమారుడు సముదాయించే క్రమంలో తండ్రిని చేతులతో వెనక్కి నెట్టి వేయడంతో ఇనుప యంత్రంపై పడి తండ్రి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దామర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. షాబాద్ సీఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని దామర్ల పల్లి గ్రామానికి చెందిన కమ్మరి సదానందం చారి (65) మద్యం సేవించి ఇంటి వద్ద భార్య కమ్మరి సుజాతతో గొడవకు దిగాడు. అది గమనించిన వారి కుమారుడు కమ్మరి రమేశ్ గొడవ పడవద్దని తల్లిదండ్రులను వారించేందుకు ప్రయత్నం చేశాడు. మృతుడు కమ్మరి సదానందం చారి కుమారుడిని మా ఇద్దరి మధ్యలో ఎందుకు వచ్చావంటూ కొట్టాడు. ఆగ్రహించిన కమ్మరి రమేశ్ తండ్రిని చేతులతో నెట్టి వేశాడు. పక్కనే ఉన్న ఇనుప యంత్రంపై మృతుడు కమ్మరి సదానందం చారి పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కమ్మరి సదానందం చారిని వైద్యులు పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుని భార్య కమ్మరి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు షాబాద్ సీఐ వెల్లడించారు.