రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూములు హాట్ కేకుల్లా రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారని హౌసింగ్ ఎండి వి.పి గౌతమ్ తెలిపారు. కుత్భుల్లాపూర్ పరిధిలోని చింతల్‌లోని నివాస భూముల విక్రయాలను సోమవారం బహిరంగ వేలం ద్వారా నిర్వహించామన్నారు. ఈ వేలంలో చదరపు గజం రూ. 1,14,000 పలికిందని ఆయన వెల్లడించారు. హెచ్‌ఐజి 513 గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్‌కు ఆఫ్‌సెట్ ధర రూ. 80వేలుగా నిర్ణయించగా, బహిరంగ వేలంలలో రూ. 1.14 లక్షలు పలికిందన్నారు. ఇందులోనే 389 విస్తీర్ణంలోని మరోక ఓపెన్ ప్లాట్ చదరపు గజానికి లక్షల రూపాయలు పలికిందని తెలిపారు. ఈ బహిరంగ వేలంలో 18 ఓపెన్ ప్లాట్లు, నాలుగు ప్లాట్లకు గాను హౌసింగ్ బోర్డుకు సుమారు రూ. 44.24 కోట్ల ఆదాయం సమకూరిందని ఆయన వివరించారు. ఈ వేలం పాటల్లో 27 మంది బిడ్డర్లు పాల్గొన్నారని, చదరపు గజానికి సగటున రూ. 91,947 ధరకు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. కెపిహెచ్‌బి, గచ్చిబౌలి పరిసరల్లోని భూములకే అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో చింతల్ ప్రాంతంలో చదరపు గజం లక్ష దాటడం విశేషమన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నివాస భూములకు మంచి డిమాండ్ ఉందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.