తల్లిదండ్రులు లేని నిరుపేద, ప్రతిభావంతుడైన ఎంబిబిఎస్ విద్యార్థి గణేశ్‌కు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అండగా నిలిచారు. ఆర్ముళ్ల గణేష్ అనే విద్యార్థి పూర్తి వైద్య విద్యఖర్చును తామే భరిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు, తొలి విడతగా అడ్మిషన్ ఫీజు కోసం అవసరమైన రూ. 1,50,000ను బిఆర్‌ఎస్ నాయకులు సోమవారం రోజున గణేష్‌కు అందించారు. వరంగల్‌లోని పశ్చిమ నియోజకవర్గం, పెద్దమ్మగడ్డకు చెందిన ఆర్ముళ్ల గణేష్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును కూడా కోల్పోయి, తన అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. పేదరికం వెంటాడుతున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివి, పట్టుదలతో కష్టపడి ఎంబిబిఎస్ ఫ్రీ సీటు (ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీలో) సాధించారు. అయితే, ఈ నెల 6వ తేదీలోపు ట్యూషన్ ఫీజు, డిపాజిట్ కింద రూ. 1,50,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడువులోగా డబ్బు చెల్లించకపోతే సీటు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకున్న కొందరు సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ఎక్స్ వేదికగా చేసిన విజ్ఞప్తికి కెటిఆర్ స్పందించారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వెంటనే స్పందించి గణేష్ ఎంబిబిఎస్ చదువు పూర్తి బాధ్యత బిఆర్‌ఎస్ పార్టీ తరపున తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో, బాలసముద్రంలోని హన్మకొండ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బిఆర్‌ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం రోజున గణేష్‌ను, అతని మామ దేవదాసును కలిశారు.
కెటిఆర్ ఆదేశాల మేరకు తక్షణ సాయంగా రూ. 1,50,000 చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… సాయం అవసరమైన వేలాది మందికి అండగా నిలిచిన మనుసున్న నేత కెటిఆర్ అని కొనియాడారు. కెటిఆర్ ఆదేశాల మేరకు తాము నేరుగా ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీకి వెళ్లి, ఈ తక్షణ సాయంతో గణేష్ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఎంబిబిఎస్ చదువు పూర్తి అయ్యేంత వరకు అయ్యే ఖర్చును మొత్తం కెటిఆర్, బిఆర్‌ఎస్ పార్టీ తరపున అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్ఫూర్తితోనే బిఆర్‌ఎస్ పేద ప్రజల కష్టాలకు స్పందిస్తుందని వినయ్ భాస్కర్ అన్నారు. పేదలకు విద్య, వైద్యం అందేలా కెసిఆర్ పదేళ్ల పాలనలో కృషి చేశారని, అదే సంస్కృతిని కెటిఆర్ కొనసాగిస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థి ఆర్ముళ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆపద అని వస్తే కాపాడే ధైర్యం, కష్టం అని తెలిస్తే తీర్చే మంచితనం కెటిఆర్ అన్నది అని పేర్కొన్నారు. గణేష్ కోసం ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసిన జర్నలిస్ట్ బొలెపాక రాజేష్‌కు, అతని మామ దేవదాసుకు, పాస్టర్ స్వామి దాసుకు, ఈ పరిస్థితిని కెటిఆర్‌కు చేరవేసిన దామెర అక్షయ్‌కు వినయ్ భాస్కర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.