ఎలాంటి కళ్లు అవి?
ఆకాశంలో అంతెత్తున ఎగురుతూ
నేల మీద కదలాడుతున్న
ఎరను పసిగట్టే డేగ కళ్లు కదా ఆ కళ్లు
అప్పటి వరకూ చెట్టు కొమ్మ మీద
తపోదీక్షలో ఉన్నట్టు మౌనంగా కూచున్న
లకుముకి పిట్ట ఉన్నట్టుండి అదాటున
చెరువులోకి దూకి చేపపిల్లను నోట కరచుకొచ్చిన
ముక్కుకొన వాడి చూపులు కదా ఆ కళ్లు
కొన్ని వేల పేజీల మైదానాలపై
లక్షల వాక్యాల పచ్చికల వెంట
పరుగులు తీసి చెంగనాలు పోయిన
లేడి పిల్లల చురుకు గంతులు కదా ఆ కళ్లు
కన్ను గానని కారు చీకట్లో పుంత తోవను
చేయి పట్టి నడిపించే మిరుమిట్లు గొలిపే
ఆనంత మిణుగురుల గుంపు కదా ఆ కళ్లు
వాన కురిసి వెలసిన ఒక సూర్యోదయపు వేళ
టెలిఫోను తీగల మీద బారులు తీరిన
వజ్రపు అంచుల వాన చినుకుల
మిల మిలలు కదా ఆ కళ్లు
లోకపు పెను చీకట్లను
భీకర శబ్దాలతో దునుమాడే
మేఘపు వెండి అంచుల మెరిసే
విద్యుల్లతలు కదా ఆ కళ్లు
పొంగి పొర్లే వాగు వొడ్డున
రెండు దోసిళ్ల ఇసుకను తవ్వగానే
జలజలమంటూ జలం పైకుబికి వొచ్చినట్టు
నిత్య కరుణార్డ్ర సజల నేత్రాలు కదా ఆ కళ్లు
అర్థరాత్రి అరణ్యంలో
పొదల చాటున మాటు వేసి
వేట కోసం ఎదురు చూసే
ఆకలి గొన్న చిరుత పులి
రేడియం కళ్లు కదా ఆ కళ్లు
ఇప్పుడు ఆ కళ్లే పక్షులు వదలి వెళ్లిపోయిన
పాడుబడ్డ గూళ్లలా.. పెంజీకటి కవ్వలి
కృష్ణబిలాల్లా ఇప్పుడు ఆ కళ్లే..
– శిఖామణి
– (గురువు గారు కె.శివారెడ్డి గారికి)