నీ పక్కన పడ్డాది పిల్లా సూడు
నాది నక్కిలీసు గొలుసు
గున్న గున్న మామిడి గున్న మామిడి తోటకి..
డీజె టిల్లు మామా..
కనీకనపడని రంగురంగుల ఎల్‌ఇడి లైట్ల కింద కాళ్ళు ఆడిస్తూ, చేతులు పైకి ఊపుతూ, పండగ, పెళ్లి, దేవుని ఊరేగింపు ఇలా సందర్భం ఏదైనా గల్లీలలో, పట్టణంలో, పల్లెలో ఎక్కడ చూసినా డీజే పా టలకి డాన్స్‌తో చిందులు తొక్కే యువత, పిల్లలు వృద్ధులు మనకి ఇప్పుడు కనపడుతున్నారు. డీజే తో డాన్స్ చేయడం అనేది ప్రజాస్వామ్యీకరణ చెం దింది. ఆదిమ మానవుడి కాలం నుండే, వేటలో, పనిలో భాగంగా కళ పుట్టింది అంటారు. తర్వాత దేవుళ్ళ కర్మకాండ వచ్చింది. ఆ కర్మ కాండ నుండి కూడా కళ పుట్టింది అని చెబుతారు. ముందు ఆట, తర్వాత పాట, తర్వాత మాట, సంగీతం, కవిత్వం, కథలు, నాటకాలు, నవలలు, సినిమాలు.. అలా కళలు ఎలా పురోభివృద్ధి చెందాయో మనకు తెలు సు. నిజానికి డప్పులు మోగితే, డాన్స్ చేయాలని ఎవరి కాలు ఊగదు, కానీ విమర్శలు, వెక్కిరింత లు, వచ్చే అడ్డంకులో డాన్స్ చేయడం అంటేనే ఏదో పాప కార్యం అన్నట్టుగా అయిపోయింది. అందు లో స్త్రీలకి మరిన్ను. డాన్స్ చేయాలి అనే కోరిక బలంగా ఉన్న ఆడవాళ్లు ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి దేవుడు పట్టిన దానిలాగానో, దెయ్యం పట్టిన దాని లాగానో డాన్స్ చేసి తమ శరీర ఇచ్చని అలా నెరవేర్చుకుంటారు అనిపిస్తుంది. ఎప్పుడైనా దేవుడి పేరుతో చేసే డాన్స్‌కి కొంత ఒప్పుదల లభిస్తుంది సమాజంలో.
సామూహిక కళాత్మక వ్యక్తీకరణ అనేది సమాజ అభివృద్ధి క్రమంలో క్రమంగా విడిపోయి, చేసే వాళ్ళు, చూసే వాళ్ళుగా, ప్రోసీనియం స్టేజీ వచ్చి విడదీసింది. ఆటలు, పాటలు, జానపద కళా రూపాలుగా, అవి కొందరికే చెందినవిగా మిగిలిపోయాయి. పాశ్చాత్య విద్యా ప్రభావంతో ఆధునిక కవిత్వం, కథలు, నవలలు వచ్చి ఈ రూపాలన్నీ మరింత సోఫిస్టికేట్ అయ్యాయి. యూరోపియన్ నాటక రంగం భారతదేశంలో కాలూనింది. దాని ప్రభావంతో ఒక కాలంలో పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు వెల్లువలా వచ్చాయి. జానపద కళా రూపాలు కింది కులాలకే పరిమితం అయితే, సంప్రదాయ సంగీత, నృత్యాలు రాజుల ఆస్థాన మందిరాలకి, దేవదాసీలకు పరిమితం అయ్యాయి. శాస్త్రీయ సంగీతం పెద్ద కులాలకే పరిమితం అయ్యింది. జానపద బాగోతాలు, యక్షగానాలు గ్రామీణ జనం ఆటపాటలుగా ఉండేవి. పాటలు అనేవి పనిలో భాగంగా ఉండేవి. ఆ పాటలు పాడేవారు చూసేవారు వేరుగా ఉండేవారు కాదు. అందులో రిధంని పనిముట్లే అందించేవి.
ప్రజా నాట్య మండలి వంటి అనేక సంస్థలు తర్వాత ప్రజా కళారూపాలని వాడుకలోకి తెచ్చా యి. ప్రజల పాటలకి, విప్లవ వస్తువు జోడించి మళ్లీ జానపద కళారూపాలకి మరింత ప్రాచుర్యం కల్పించాయి. తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున ప్రాంతీయ అస్తిత్వం నేపథ్యంతో ఎన్నడూ లేని విధంగా ఆట, మాట, పాట సాగింది. ఎందరో కవులు, కొత్తగా గాయకులు పుట్టుకొచ్చారు.
సినిమా రంగం మొదటి నుంచి శాస్త్రీయ సంగీతం కంటే జానపద రూపంలో ఉన్న పాటల ద్వారానే ఎక్కువ మందిని చేరుకోవచ్చని భావించింది. ఒక పక్క మంచి కొంత సామాజిక స్పృహతో పాటలు వస్తూనే, మరో పక్క ఐటెం సాంగ్స్ పాటల డాన్స్‌లతో జనాలని థియేటర్స్‌కి రప్పించే వాళ్ళు. ఆ పాటలే చాలాసార్లు సినిమా తెరను దాటి, ప్రేక్షకులను దాన్లో భాగం చేయిస్తాయి. పారిశ్రామికీకరణ జరిగి ఎప్పుడైతే యంత్రాలు వచ్చేశాయో సంగీతం రణగొణమయం అయిపోయింది. గులక రాళ్ళు డబ్బాలో పోసి కొట్టినట్టు. ఎలక్ట్రిక్ గిటార్లు, కీ బోర్డులు, జాజ్‌లు, డ్రమ్స్ వచ్చేశాయి. పట్టణీకరణ, రణగొణ ధ్వని మన జీవితంలో భాగం అయిపోయినప్పుడు అటువంటి పాటలు రాక ఏమి చేస్తాయి. యాక్టివ్‌గా పాటలు పాడేవాళ్ళు పాసివ్‌గా చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని వినేవాళ్ళుగా మనుషులు మారిపోయారు. ఎవరి ఇంట్లో టివి వారికి అయిపోయింది. మరో పక్క సౌండ్ సిస్టం టెక్నాలజీలో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ఒకప్పుడు రేడియో, గ్రామఫోన్ మాత్రం ఉండేవి. తర్వాత కాసెట్స్ వచ్చాయి, ప్లేయర్స్, డీవీడీలు, సిడిలు, ఫోన్‌లు, ఇంటర్నెట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ రకరకాల మార్గాల్లో అందరికీ సంగీతం అందుబాటులోకి వచ్చింది. డీజె అం టే డిస్క్ జాకి అని అర్థం. రికార్డ్ మ్యూజిక్‌ని ప్రేక్షకుల కోసం ప్లే చేసేవాడు అని అర్థం. వీరిని మ్యూ జిక్ క్యూరేటర్స్ అనవచ్చు. మొదట వీళ్ళు రేడియో లలో పాటలు వినిపించేవారు. తరువాత లైవ్ ప్రో గ్రామ్స్‌కి ప్లే చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరికీ డీజె ఒక వేదిక అయ్యింది. ఒక సామూహిక వ్యక్తీకరణ అయిపోయింది.
నలుగురూ కూడి గెంతడం అనేది. వేసేవాళ్ళు చూసేవాళ్ళు అనే గీతని చెరిపి కళ అందరిది అన్నట్లు చేస్తుంది. నీకు కచ్ఛితంగా డాన్స్ రావాలని లేదు. దాని హై సౌండ్‌కి ఆటోమేటిక్‌గా ఊపు వస్తుంది. గెంతాలి, కాళ్లు, చేతులు ఊపుతూ, నిన్ను నువ్వు ఒక గంట మరిచిపోవాలి, చెమటలు చిందా లి. అది ఒక వ్యాయామంలా ఉంటుందేమో. పిచ్చివాడిగానో, దేవుడో, దెయ్యమో పట్టినట్టుగా కాకుం డా, మనిషిలో సహజమైన కోరిక రిధానికి అనుగుణంగా బాడీ కదపడం అనేది. డాన్స్‌లో ట్రాన్స్ అనేది వ్యక్తిని ఒక లిమినల్ స్టేట్‌లో పెడుతుంది. ఆ స్థితిలో వాళ్ళు క్షాళన చెంది మళ్ళీ బయటకి మామూలు వ్యక్తుల్లా వస్తారు. మనం పాసివ్ స్థితి నుండి యాక్టివ్ స్థితిలోకి మారడానికి డీజే ఒక ఉపకరణం. అయితే దాని అతి శబ్దాలు ప్రమాదం. ఏ ఆనందం అయినా తోటివారికి హాని చేయనంత వరకు ఫర్వాలేదు. అందుకే డీజేకి హద్దులు పెట్టుకుని ఆనందించడం మన బాధ్యత.
– జి.ఆర్. శివ్వాల