పెద్దవాగు పాటవింటున్నంతసేపు
అరుణ కాంతుల పరవళ్లు
సుస్వర రాగాలు ప్రవహించినంత దూరం
జలపాతంలో స్నానం చేసినట్లుంటది
పల్లె కన్నీరని
ప్రపంచానికి ఎజెండాగా చేసిన శ్రామికగీతం
సమస్త వృత్తుల జీవన సౌందర్య గీతం
పచ్చ జొన్నకంకులు పాలువోసుకున్నట్లు
ఉవ్వెత్తున ఆకాంక్షల సమరోత్సాహం
ఆ చిటుకుల అందెల రవళులకు
పడగెత్తి బుసకొట్టే పాషాణాలు
కన్నీరు, మున్నీరూ పరిపూర్ణ చంద్రోదయం
చినుకు, జడివాన, మహానది,
మహా సముద్రం కవితాత్మక రాగంలో
ఒదుగడానికి పోటీ పడుతున్నాయి
నల్లతుమ్మ, కొంగ, పిట్ట, సెరువు వెన్నెల
ప్రజల హృదయాలలో మనోముద్రలు
చిందు, భాగోతం, యక్ష, బైరాగి
జమిడీక రాగాలు సమస్తం
పసి మనసు అగ్నిగుండం దూలాడినట్లు
లేగదూడలు అంబాడే అంబురం
బొంగురమై తిరిగే ఆట
పంటచేలు పురి విప్పినట్లు
నక్షత్రాలు కాంతిని విరజిమ్మినట్లు
హరిదాస సంకీర్తనలు అవని రాగాలు
రాజ్యహింసపై రణం, అంటరాని
గాయాలపై పెను సమరం
సమస్త పీడనలపై కార్యక్షేత్రమై
కవాతు చేసింది
మహనీయుల బోధనల
సమతా శాంతి గీతాలాపనలతో ప్రతిధ్వనిస్తూ
అస్తిత్వానికి ఆత్మగౌరవ శిఖరాగ్రం
కాలం అతని పాటతో మేల్కోంటుంది
సంధ్య, అతని అందెల సవ్వడిలో
సేదతీరుతూ నిద్రలోకి జారుతుంది
సూర్యునిది గూడ సంచారమే
అతని పాటది కూడ నిత్య సంచారమే
తరగని భావం తరిగిపోని నిధి
దురాక్రమణ, దుర్బుద్ది, దోపిడీ నిరంతరం
ఆధిపత్య అగ్ని మంటలపై గజ్జ కట్టిన
ఎదురీతలు సమధర్మానికై సమతా గేయాలు అఖండ విముక్తి గీతాలు
బంతి చేమంతులు, బొండుమల్లెల పరిమళాలు
అక్కమహాదేవి, బసవేశ్వరుడు, లక్షమ్మ
ఎరుకలి నాగన్న మీదైనా, ఉత్తరాంధ్ర మీదైనా
పోరాటాల పరిటాల శ్రీరాములైనా
రాయలసీమ రతనాల సీమైనా
సకల అస్తిత్వాల జీవన రాగాల జీవధారలు
లేతకాళ్లు వెండిపట్టీలు తొడుక్కున్న కాంతి
వ్యవసాయనికి నాగలిలా
తెలంగాణా మహాసంగ్రామానికి
యుధ్ధ గానాలు
తల్లీ తెలంగాణమా నిలువెల్ల గానమా
పూసిన పున్నమి వెన్నెల వీణ..
పునర్మిర్మాణ పుట్ట బంగారాలు
కృష్ణా, గోదావరి పరవళ్లలా చైతన్యధారలు
పాలమీగడల తేనె ధారలు
తాటికల్లును ఒంపినట్లు, చెత్తిరి పరుచుకున్నట్లు
వెదురు గుమ్ములల్లుకున్నట్లు
మగ్గంపై చేనేత సింగిడీలు పరిచినట్లు
కసిర గొంగళ్లు కుచ్చుల కడలేసినట్లు
జమ్మి చెట్టున పాలపిట్టలు వాలినట్లు
దీపావళి సంబరాలలా
సంక్రాంతి ముగ్గులు పరుచుకున్నట్లు
ఉగాది షడ్రుచుల సమ్మేళనాలను
ఒంపుతున్న తొలకరి గేయాల సందళ్ళు
కాలజ్ఞానాల తత్వాలు
అచల యోగుల అడుగు జాడలు
హనుమద్దాసు అపర కీర్తనలు
అన్నమయ్య సంకీర్తనలు పాల్కూరికీ స్మరణలు
హఠయోగి చెన్నదాసు పురాతత్వాలు
సత్యహరిశ్చంద్ర వీరబాహుడి రాగాలు
నాటక రంగం అతని అంతరంగ గంధం
నా కొడుకు అంటున్నాడు
నాయనా అల్లరి చేయకు
టివిలో వెంకన్న పాటొస్తున్నది
పెదనాయన జీర రాగం వినమంటున్నాడు
పాత చాటల మీద డేంకడెడ్డం పాటకు
చెరువు సెలిమలలో చిందులేస్తున్న పిల్లలు
పరుగెత్తే పిచ్చుకలు
పాటసంబురానికై నేలవాలిన చిలుకలు
పాటకు డాక్టరేట్ వచ్చిన సంబురం
కోయిల కిలకిలరావాలు
పిచ్చుకలు కిచకిచల చప్పట్లు
దిగ్ దిగ్దింతాలు దోసిళ్లు పట్టినయి
నదులు పూర్ణకుంభాలై, పకృతి బోనమెత్తింది
ధరణి గండదీపమెత్తింది
అమ్మ ఈరమ్మ గొంతుకై
అపరదనుర్దాసు నాయనై
జయహో గోరటివెంకన్న పాటకు
అంబరాన హారతులు
– వనపట్ల సుబ్బయ్య
– (అంబేద్కర్ సార్వత్రిక విశవిద్యాలయం
ప్రజాకవి గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా)