అరుంధతి రాయ్ రాసిన సరికొత్త పుస్తకం ‘మదర్ మేరీ కమ్స్ టు మి’. తల్లిదండ్రులు, పిల్లలు, అన్యోన్య సంబంధాలు, పిల్లల చదువు లు, వాళ్ళ పెళ్లిళ్లు, మనవలు, మనవరాళ్లు.. ఇదీ సగటు మానవ జీవితాలు కొనసాగే చట్రం. ఇందులోనూ అనేక ఆటుపోట్లు, ఎత్తు పల్లాలు, సుఖ దుఃఖాలుంటాయి. కానీ, ఒక ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ సాధించిన రచయిత్రి జీవితం మాత్రం అదికాదు. బాల్యం నుంచి తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏమిటో తెలియదు ఆమెకి. అసలు తండ్రి రూపాన్నే అనుకోని పరిస్థితుల్లో తాను ఊ హించని స్థితిలో చూసింది. తండ్రిగా మనకి పరిచయం చేసినా, అతడిని మిక్కీరాయ్ అని మాత్ర మే సంబోధిస్తుంది. ఇక తల్లి తనను, అన్నను పెంచింది పెద్ద చేసింది. కానీ, ఆ తల్లి అరుంధతి కోరుకున్న ప్రేమను బాల్యంలో ఆమెకి ఇవ్వలేదు. పెద్దగ అయ్యాక కూడా ఇవ్వలేదు.
అలాంటి వాతావరణంలో పెరిగి పెద్దయి ఢిల్లీలో ఆర్కిటెక్చరర్ చదివి, తనంత తానుగా ఏర్పరచుకున్న మానవ సంబంధాల వల్ల, సినిమా స్క్రిప్ట్ రైటర్‌గా, రచయితగా మారుతుంది. ఈ మధ్య కాలంలో ఆమెకి కొందరితో సామీప్యత ఏర్పడినా తన జీవితాన్ని తన చేతుల్లో ఉంచుకోవడం కోసం తనకు మధ్యలో అందిన ప్రేమను కూడా ఆమె వదులుకుంది. జీవిత గమనంలో ఏర్పడిన స్నేహ సంబంధాలతో సమాజాన్ని అర్థం చేసుకుంది. నర్మదా బచావ్ ఆందోళనలో తన వంతు పాత్ర నిర్వహించింది. తాను మంచిగా రాయగలుగుతున్నానని అర్థమైన క్షణంలో ‘గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్’ నవల మొదలుపెట్టింది. అది రాసే క్షణా ల్లో ఆమె తాను, తన రచన ఇంత ఎత్తుకు ఎదుగుతాయని ఊహించలేదు. అదొక అద్భుతం. ఆ రచనకు గానూ ఆమెకి బుకర్ ప్రైజ్ వరించింది. దండకారణ్యంలో విప్లవకారులతో కలిసి వారితో పాటు టార్పాలిన్ గుడారాల్లో కలిసి పడుకుంది. వారి కష్టభరిత జీవితాన్ని రుచి చూసింది. ఆ జీవితాన్ని ‘వాకింగ్ విత్ కామ్రేడ్స్’ అంటూ రాసింది. ట్రాన్స్‌జెండర్ల జీవితాల పట్ల తన అవగాహనను పెంచుకుంది. ఒక మనిషి జీవిత కాలంలో ఎంత చేయగలుగుతారో అంతకన్నా ఎక్కువే చేసింది. అనేక తప్పుడు కేసులను ఆమె ఎదుర్కొంటూ ఉంది ఇప్పటికీ. ఆమెను చూసినప్పుడు ఆమె జీవితంలో ఇంత సంక్లిష్టత ఉందని ఎవ్వరూ అనుకోరు.
ఆమె పుస్తకం చదివితే, ఆమె జీవిత వైరుధ్యాలు, ఆమె విజయాలు, ఆమె దుఃఖాలు, ఆమె భావాల న్నీ మనకి కనిపిస్తాయి. నిజంగా ఒకరి జీవితం ఇంత సంక్లిష్టభరితం అవడం, చేతిలో నయా పైసా లేకుండా ఢిల్లీ వీధుల్లో అడుగుపెట్టిన ఆమె, అక్కడే ఒక అపార్ట్‌మెంట్ కొనుక్కోవడం, ఆమె కోరుకున్న జీవితం కోసం నిబ్బరంగా నిలబడ టం గొప్పగా అనిపిస్తాయి. అరుంధతి రాయ్ వాళ్ల అమ్మ, నాన్న, అన్న, మామల గురించి తనకు చిన్నపుడు స్నానం పోసి, అన్నం పెట్టిన కోచమ్మాళ్, ఇంకా తన జీవితంలో తారసపడ్డ ప్రతి ఒక్కరిని మనకు పరిచయం చేస్తుంది. వాళ్ల స్వభావాల గురించి మాత్రమే వర్ణిస్తుంది. ముఖ్యంగా వాళ్ల అమ్మ గురించి రాసే ప్రతి అక్షరం పాఠకులకు ఆశ్చర్యమనిపిస్తుంది. ఆమె స్వభావంలోని సంక్లిష్టతను మనకి స్పష్టంగా చూపిస్తుంది. ఎక్కడా వాళ్లను నిందించదు. ఆ సంమయనం నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది. పరిస్థితులు ఎవరినైనా, ఎట్లా అన్నా మారుస్తాయనే ఎరుక మనకి అందిస్తుంది. ఇది వట్టి నవల కాదు.. ఒక రకంగా అరుంధతి రాయ్ ఆత్మ కథానాత్మక నవల. ఏకబిగిన మనల్ని చదివించే శైలి, కథనం ఒక గొప్ప అనుభవం. నిజంగా ఒక రచయిత వెనుక ఒక మహిళ వెనుక, అసలు ఏఏ మనుషుల్లో అయినా ఎంత సంక్లిష్టత ఉంటుం దో అర్థమవుతుంది. ఆ సంక్లిష్టత వల్ల ఇంకా పదునెక్కిన, ఒక బుక ర్ ప్రైజ్ విన్నర్ రాసిన ఈ పుస్తకాన్ని అందరూ కచ్ఛితంగా చదవాల్సిందే.
– డాక్టర్ రజని నెల్లుట్ల