న్యాయ పోరాటంతో సాధించుకుందాం
సాధ్యం కాకపోతే పార్టీ తరఫున రిజర్వేషన్లు
సిఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి, పిసిసి చీఫ్ నిర్ణయం
ఢిల్లీకి వెళ్ళిన డిప్యూటీ సిఎం, మంత్రులు పొన్నం, వాకిటి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిసి రిజర్వేషన్లను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉండగా, రిజర్వేషన్లను ఛాలెంజ్ చేస్తూ ఒకవైపు హైకోర్టులో, మరోవైపు సుప్రీం కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ, బిసి సంఘాల్లోనూ, అన్ని కులాల్లోనూ ఉత్కంఠత నెలకొంది. సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై న్యాయకోవిదులతో చర్చించి, వారికి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు వీలుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.
ఇదిలాఉండగా ఆదివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు సమావేశమై చర్చించారు. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రభుత్వం తరఫున వాదించనున్న న్యాయవాదులతో సమావేశం కావాలని, వారికి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు వీలుగా అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. బిసి రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో నెంబర్ జివో విడుదల చేయడంతోనే రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల పరిమితిని దాటిపోయిందని హైకోర్టులో మాధవ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల ఎనిమిదో తేదీన హైకోర్టులో మలి విడత విచారణ జరగనున్నది.
పార్టీపరంగా రిజర్వేషన్లు..
సుప్రీం కోర్టు, హైకోర్టులో బిసి రిజర్వేషన్లపై పట్టువదలకుండా న్యాయ పోరాటం చేయాలని ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే కోర్టుల్లో అనుకూలంగా తీర్పు రాకపోతే పార్టీ పరంగా బిసిలకు రిజర్వేషన్లు కల్పించి బిసిలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు భావించారు.