నలుగురి పేర్లు ప్రతిపాదించిన కాంగ్రెస్
తుది నిర్ణయం అధిష్టానానిదే
జాబితాలో నవీన్, బొంతు, సీఎన్ రెడ్డి, అంజన్
స్థానికునికే ప్రాధాన్యత అంటూ సంకేతాలు
సిఎంతో, మీనాక్షి, మహేశ్, పరిశీలకుల మంతనాలు
భట్టితోనూ విధిగా భేటీ అయిన మీనాక్షి,మహేశ్, పొన్నం, తుమ్మల, వివేక్
మన తెలంగాణ/హైదరాబాద్‌ః జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నలుగురు ఆశావాహులతో ఎట్టకేలకు జాబితాను తయారు చేసింది. ఈ జాబితాను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్వయంగా ఆదివారం సాయంత్రం ఢిల్లీకి తీసుకొని వెళ్లారు. ఇక్కడి నుంచి ఎనిమిది మంది ఆశావాహులు పోటి పడినప్పటికీ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలు, సామాజిక సమీకరణలతో వడబోసి వీరిలో నుంచి నలుగురిని రాష్ట్ర నాయకత్వం ఎంపిక చేసింది. వీరిలో నుంచి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధిష్టానానికి అప్పగించింది. జాబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు ఇంచార్జీలుగా వ్యవహరించిన ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంకటస్వామి నుంచి మూడేసి పేర్ల చొప్పునా విడి విడిగా అశావాహుల పేర్లను పీసీసీ తెప్పించుకుంది. వారు సమర్పించిన జాబితాలపై ఆదివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డితో రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై చర్చించారు. అనంతరం నలుగురి పేర్లతో రూపొందించిన జాబితాను ఫైనల్ చేసింది. ఇక్కడి నుంచి పలువురు నేతలు పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరచడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం చివరకు ముగ్గురు పేర్లను సిఫార్సు చేసినట్లు తెలిసింది. వీరిలో నవీన్ కుమార్ యాదవ్, బొంతు రాంమోహన్, సిఎన్ రెడ్డి ఉండగా, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ గట్టిగా పట్టుబట్టడంతో నాలుగవ పేరుగా ఆయనను కూడా చేర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎలాగు తుది నిర్ణయం తీసుకునేది అధిష్టానమే కావడంతో ముగ్గురి పేర్లు మాత్రమే పంపించాలని సూచించినప్పటికీ అంజన్ కుమార్ యాదవ్ పేరును చేర్చక తప్పలేదని ఈ కసరత్తులో పాలుపంచుకున్న మంత్రి ఒకరు చెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికంగా ఉండే నాయకున్నే అధిష్టానం ఎంపిక చేస్తుందనే సంకేతాన్ని పార్టీ నేతలకు ఇప్పటికే ఇచ్చారు. స్థానికంగా ఉండేవారికే టిక్కెట్ ఇవ్వనున్నట్లు ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో ఆయనపై మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, ప్రతి ఇంటితో తనకు అనుబంధం ఉన్నందున తాను సునాయసంగా గెలుపొందగలనని అంజన్ కుమార్ వాదిస్తున్నారు. తన కుమారుడు రాజ్యసభ సభ్యునిగా ఉన్నంత మాత్రాన తనకు టిక్కెట్ ఎందుకు ఇవ్వరన్నది ఆయన వాదన.
మీనాక్షి నటరాజన్‌తో భేటీ..
సిఎం రేవంత్ రెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత వారు మీనాక్షి నటరాజన్‌తో మరోసారి ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్ వెంకట స్వామి సమావేశమై చర్చించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైనా వారు చర్చించారు. తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నందున జెడ్‌పిటిసి అభ్యర్థులను సిఫార్సు చేయాల్సిందిగా జిల్లా మంత్రులను, ఎంపిలను, ఎమ్మెల్యేలను ఆదేశించిన విషయాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.
జూబ్లీహిల్స్ నియోకవర్గం ఉప ఎన్నిక అభ్యర్థి అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషనన్లు, కోర్టు కేసుల తదితర అంశంపైనా చర్చించారు. ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నియమితులైన 22 మంది పరిశీలకులు కూడా హాజరయ్యారు.