సమన్వయం కొరవడిందన్న ఎంపిలు కొండా, అరుణ, ఎమ్మెల్యే కాటిపల్లి
అంతర్గతంగా మాట్లాడుకుందామన్న రాంచందర్ రావు
జూబ్లీహిల్స్, 15 జెడ్‌పి భవనాలపై బిజెపి జెండా ఎగరాలి
పదాదికారుల సమావేశంలో పార్టీ చీఫ్ పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్ర పదాదికారుల సమావేశంలో అసంతృప్తి సెగలు ఎగిసిపడ్డాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదివారం పార్టీ పదాదికారుల సమావేశం నిర్వహించారు. రాంచందర్ రావు ప్రారంభోపన్యాసం ముగిసిన అనంతరం ముఖ్య నాయకులను మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సమన్వయం కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఎంపి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు లేవని ఆవేధన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు. చేవేళ్ళ లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. జిల్లా ఇన్‌ఛార్జిల పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇవే పరిస్థితులు కొనసాగితే పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చిరించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
మహబూబ్‌నగర్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యురాలు డికె అరుణ కూడా ఇదే తరహాలో అసంతృప్తిని వ్యక్తం చేయగా, పదాదికారుల సమావేశం ముఖ్యోద్దేశం పక్కదారి పడుతుందని, సమస్యలు ఏవైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుందామని రాంచందర్‌రావు సూచించడంతో ఈ చర్చ అక్కడితో ఆగిందని తెలిసింది.
స్థానిక ఎన్నికలలో, జూబ్లీహిల్స్‌లో కమలం వికసించాలి..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పదిహేను జిల్లా పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకుని జెడ్‌పి భవనాలపై పార్టీ జెండా ఎగుర వేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన ప్రసంగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధానంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనందరికీ పరీక్ష వంటిదని అన్నారు. తాను అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కొత్త కార్యవర్గం ఏర్పాటైన తర్వాత ఎదుర్కొంటున్న మొదటి పరీక్ష అని ఆయన తెలిపారు. కాబట్టి ఈ పరీక్షలో మనం గట్టెక్కితే రాబోయే ఏ ఎన్నికలనైనా సునాయసంగా ఎదుర్కొని పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగలమని ఆయన చెప్పారు. పార్టీ కొత్త కార్యవర్గం పూర్తిగా చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం వచ్చిందన్నారు. అత్యవసర పనులు మినహా మిగతా పనులన్నింటినీ పక్కన పెట్టి పూర్తి సమయం పార్టీ కోసం కేటాయించాలని అన్నారు.
జిఎస్‌టి తగ్గింపు ప్రధాన అస్త్రంగా..
కేంద్రం చేపట్టిన, ఇంకా చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, ఇందుకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను సమాయత్తపరిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్లించడంపై దృష్టి పెట్టాలని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని ఆయన సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్-ప్లాన్‌కు నిధులు విడుదల చేస్తే వాటిని ఇతర పథకాలకు మళ్లించడాన్ని గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టిందని ఆయన ఉదహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని, అందుకే కేంద్రం విడుదల చేసే నిధులు దారి మళ్ళుతున్నాయని రాంచందర్ రావు విమర్శించారు.
జూబ్లీహిల్స్‌లోనూ ఘన విజయం
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో ఘన విజయం సాధించాలని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహపడుతున్నారని ఆయన తెలిపారు. దీంతో అభ్యర్థి ఎంపికకు కమిటీని నియమించినట్లు ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపి పి. రాములు, అడ్వకేట్ ఆంజనేయులతో కమిటీని నియమించినట్లు ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఆశావాహుల పేర్లను పరిశీలించి నివేదిక అందజేయాల్సిందిగా కమిటీకి సూచించినట్లు రాంచందర్ రావు చెప్పారు.