మన తెలంగాణ/హైదరాబాద్‌ః తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కొంత మంది గిట్టనివారు దుష్ప్రచారం చేస్తున్నారని బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదని ఆయన ఆదివారం తెలిపారు. తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం లేదని, శాసనసభ్యునిగా కొనసాగుతానని ఆయన వివరించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.
దానం నాగందర్ పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారం ఉన్నందున ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ సుప్రీం కోర్టులో, స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి బిఆర్‌ఎస్ తరఫున ఎన్నికై రాజీనామా చేయకుండానే లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినందున ఆయనపై తప్పకుండా అనర్హత వేటు పడుతుందని రాజకీయ విశ్లేషకులు, న్యాయకోవిదులు చెబుతున్నారు. దీంతో ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నా, పార్టీ నాయకత్వం అందుకు ససేమిరా అనడంతో, చివరకు ఆయన పార్టీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని, ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.