విరిగిపడ్డ కొండచరియలు.. విమానాలు బంద్
ఆదుకుంటామన్న భారత్
పరిస్థితిపై ప్రధాని మోడీ ప్రకటన
పొరుగుదేశం భూటాన్‌లోనూ వరదల ఉధృతి
సహాయక చర్యలలో భారత సైన్యం
ఖాట్మాండూ : నేపాల్‌ను భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు అస్తవ్యస్థం చేశాయి. ఆదివారం అంతకు ముందు రాత్రి పలు దుర్ఘటనలో కనీసం 51 మంది వరకూ మృతి చెందారు. వందలాదిగా గాయపడ్డారు. ప్రత్యేకించి తూర్పు నేపాల్ ప్రాంతం ఇప్పుడు భారీ స్థాయిలో దెబ్బతింది. గత రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీనితో జనం జలదిగ్బంధనంలో చిక్కారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు, బాధితులను రక్షించేందుకు రంగంలోకి దిగినట్లు సైనిక అధికారి ఒకరు తెలిపారు. దెవూమాయి, మైజోగ్‌మాయిలలో మొత్తం 37 మంది దుర్మరణం చెందారు. ఇక దెబ్బతిన్న రోడ్లపై ఆక్సిడెంట్లతో పచ్‌తర్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. అనేక చోట్ల పలువురు గల్లంతు అయ్యారు. ల్యాంగాంగ్ ప్రాంతంలో పర్వతారోహణకు వెళ్లిన 16 మందితో కూడిన సాహసికుల బృందంలో కనీసం నలుగురు కొండచరియల ధాటికి మృతి చెందారు.
నేపాల్ సైన్యం, నేపాల్ పోలీసు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితులను రక్షించే పనిలో పడ్డారు. ధరన్ మున్సిపాల్టీ పరిధిలో ఓ చోట్ల వరదల మధ్య చిక్కుపడ్డ ఓ గర్భిణి సహా నలుగురిని సైన్యం రక్షించింది. వారిని తక్షణం హెలికాప్టర్లలో ఆసుపత్రికి చికిత్సకు పంపించారు. నేపాల్‌లో ఇప్పుడు రుతుపవనాలు బలంగా ఉన్నాయి. నేపాల్‌లో వరద పరిస్థితిపై ప్రధాని మోడీ వెంటనే స్పందించారు. పొరగుదేశం ఆపద దశలో తమ దేశం ఆదుకుంటుందని హామీ ఇస్తూ ఎక్స్ సామాజికి వేదికగా ప్రకటన వెలువరించారు. నేపాల్‌కు అవసరం అయిన అన్ని విధాలైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచే రాజధాని ఖాట్మాండూ ఇతర ప్రధాన ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. దీనితో ఇక్కడి త్రిభువన్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీనితో విమాన ప్రయాణికులు, ప్రత్యేకించి భారత్ నుంచి వచ్చిన వారిలో అత్యధికులు నానా అగచాట్లకు గురవుతున్నారు.తదుపరి ఆదేశాల వరకూ విమానాల రాకపోకలను ఆపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పొరుగుదేశం భూటాన్‌లోనూ రెండు రోజులుగా భారీ వర్షాలు వరదలతో పరిస్థితి దిగజారింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కాయి. భూటాన్ అభ్యర్థనతో భారతీయ సైన్యం సహాయక చర్యలకు దిగింది. ఇక్కడి సైనిక హెలికాప్టర్లలో సహాయక చర్యలు సాగిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.