మొదట గాజాలో శాంతి స్థాపన, తర్వాత పాలస్తీనా దేశం ఏర్పాటు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 30 నాడు 20 అంశాల ప్రణాళిక ఒకటి ప్రకటించారు. ఆ సమయంలో తన పక్కన నిల్చుని ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, తాను దానిని ఆమోదిస్తున్నానని చెప్పారు. ఇంతవరకు అమెరికా, ఇజ్రాయెల్, హమాస్‌ల చర్చలలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్, ఖతార్, టర్కీలు ఆ పథకం తమకు సమ్మతమేనంటూ, అంగీకారం తెలపవలసిందిగా హమాస్‌ను కోరాయి. అంగీకరించేందుకు హమాస్‌కు 34 రోజుల సమయం ఇస్తున్నానని, ఒకవేళ కాదంటే ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఆ సంస్థను సర్వనాశనం చేయగలవని ట్రంప్ హెచ్చరించారు. ఆ గడువు ఈ 4, 5 తేదీలలో (శని, ఆదివారాలు) ముగుస్తుంది. హమాస్ నాయకత్వం ఆ ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు చెప్పింది. 2వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు ఇంకా ఎటువంటి స్పందన వెలువడలేదు. మరొక వైపు నెతన్యాహూ ఆ ప్రణాళికతో తమ “యుద్ధ లక్షాలన్నీ నెరవేరగలవ’ని ప్రకటించటం గమనించదగ్గది.
20 అంశాల ప్రణాళికను హమాస్ యథాతథంగా అంగీకరిస్తుందా? ఏమైన అంశాలపై వివరణలు కోరుతుందా? ఏవైనా సూచనలు చేయవచ్చునా? ఏదీ ఇతరులు చెప్పగలది కాదు. సందేహాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే, అందులో మంచి చెడుల మాట అట్లుంచి, ఆ ప్రణాళిక అమెరికా, ఇజ్రాయెల్ మధ్యవర్తి దేశాలు, మునుముందు తాత్కాలిక గాజా పరిపాలనను నిర్వహించగలరంటున్న బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ల మధ్య సంప్రదింపులతో మాత్రమే రూపు తీసుకున్నది తప్ప, హమాస్ అభిప్రాయాలను కోరలేదు. వాటికి అవునంటారా, కాదంటారా అనేది అట్లుంచి, కనీసం లాంఛన ప్రాయంగానైనా కోరలేదు. అంతేకాదు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలస్తీనా అధారిటీ (పిఎ) ప్రతిపాదనలను కూడా అడగలేదు. పాలస్తీనా అధారిటీ, హమాస్‌లు ప్రత్యర్థులే కావచ్చు. కాని ఆరెండు సంస్థలూ పాలస్తీనాకు చెందినవి. పైన పేర్కొన్న తక్కిన అందరూ బయటివారు. వారంత కలిసి తమ ఆలోచనలతో ఒక పత్రాన్ని పూర్తి ఏకపక్షంగా తయారు చేసారు. కనీసం దాని గురించిన అభిప్రాయాలనైనా అడగటం లేదు. మేము చేసాము, మీరు ఒప్పుకుని తీరాలని అంటున్నారు. అందుకు కొద్ది రోజుల గడువు విధించారు. ఆలోగా అంగీకరించని పక్షంలో ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ‘సర్వనాశనం’ చేయగలమంటున్నారు.
నిజానికి ఆ ఇరువురూ తోపై ఇంతకాలం ఆ పని చేస్తూనే వస్తున్నారు. ఆ పని క్షేత్రస్థాయిలో ఇజ్రాయిల్ చేస్తుండగా, వారికి అమెరికా ఆయుధాలను, నిధులను సమకూరుస్తున్నాది. ట్రంప్ ప్రణాళికను ఆమోదిస్తున్నట్లు నెతన్యాహూ సెప్టెంబర్ 30న ప్రకటించగా, ఆ తర్వాత రోజులలోనూ ఇజ్రాయెల్ హత్యాకాండ సాగుతూనే ఉంది. అమెరికా సరఫరాలు సాగుతూనే పోయాయి. ఆ చర్యలు ఆపాలని ట్రంప్ చెప్పలేదు. అనగా, పాలస్తీనా భూమికి సంబంధించి ఇంచుమించు 20వ శతాబ్దం ఆరంభంలో మొదలైన సామ్రాజ్యవాదుల చదరంగం 125 సంవత్సరాలు గడిచిన తర్వాత నేటికి కూడా ఏదో ఒక పద్ధతిలో కొనసాగుతూనే ఉందన్న మాట. చివరకు హమాస్ ఏమనవచ్చునో, విషయం ఏ విధంగా తేలవచ్చునో అనేది అట్లుంచి, ట్రంప్ ప్రణాళికలో కనిపించే సానుకూల అంశాలేవో, చిక్కు ప్రశ్నలేవో చూడాలి.
పైనుంచి కింద వరకు ఒక వరుసలో వెళితే కనిపించే సానుకూల అంశాల ఈ విధంగా ఉన్నాయి.ఈ ప్రణాళికను ఉభయులూ ఆమోదిస్తే యుద్ధం వెంటనే నిలిచిపోతుంది. ఇజ్రాయెల్ సేనలు కొంత వెనుకకు తగ్గి, బందీల విడుదల కోసం వేచిచూస్తాయి. ఈ కాలంలో సైనిక చర్యలన్నీ సస్పెండ్ మాత్రం చేస్తారు. ఉభయులు దళాలు ఎక్కడివక్కడ నిలిచిపోతాయి. బందీలను ఉభయులూ విడుదల చేసిన తర్వాత గాజాలో తాత్కాలిక పరిపాలన ఏర్పడుతుంది. ఆ బోర్డుకు అధ్యక్షుడు అమెరికా అధినేత కాగా, వేర్వేరు దేశాలకు చెందిన నిపుణులు ఉంటారు. కొందరు పాలస్తీనా నిపుణులు కూడా. గాజా వదలి వెళ్లవలసిందిగా ఎవరినీ వత్తిడి చేయరు. వెళ్లగోరే వారు మాత్రం వెళ్లవచ్చు. తిరిగి రావచు. ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకోదు. గాజా అభివృద్ధికి సంబంధించిన అన్ని నిబంధనలు ‘సంతృప్తికరంగా’ సాగే పక్షంలో, పాలస్తీనా అథారిటీ కూడా ‘సంస్కరణలకు’ గురైనట్లయితే పాలస్తీనా స్వయం నిర్ణయాధికారానికి, స్వతంత్ర దేశం ఏర్పాటుకు తగిన పరిస్థితులు అపుడు ‘ఏర్పడవచ్చు’. మొత్తం 20 అంశాలలో ఏదో ఒక మేరకు సానుకూలంగా తోచేవి ఇవి మాత్రమే. కాని, వీటితో సహా తక్కిన వాటిని నిశితంగా పరిశీలించి నట్లయితే, వాటిలో అత్యధికం ఇజ్రాయెల్, అమెరికాల ఆధిపత్యంతోపాటు ప్రత్యక్ష, పరోక్ష నియంత్రణలను కొనసాగించేవిగానే అర్థమవుతాయి.
అసలు ఆ ప్రణాళికే హమాస్‌కు ఒక ఉచ్చును పన్నటంగా అర్థమవుతుంది. ఏ విధంగానో ఒక్కొక్కటిగా చూద్దాము (1) పొరుగువారికి ప్రమాదకారి కాని విధంగా గాజాను డీ రాడికలైజ్ చేసి, టెర్రర్ ఫ్రీ జోన్‌గా మార్చుతాం. అక్కడ రాడికల్, టెర్రర్ ధోరణులు మొదటి నుంచి లేవు. ఇజ్రాయెల్, అమెరికాల విధానాలు, పాలస్తీనా దేశాన్ని నిరాకరించటం వల్లనే తలెత్తాయి. పాలస్తీనా ఏర్పడితే వాటంతట అవే సమసిపోతాయి. పాలస్తీనా ఏర్పాటుపై ఆ ప్రణాళికలో డొంక తిరుగుడుతనం, అస్పష్టతలు అనేకం ఉన్నాయి. అటువంటపుడు వీరి ఉద్దేశం రాడికలిజం పేరిట స్వతంత్ర ధోరణులను, యువతను ఈలోపే అణచివేయటమని తోస్తుంది. (2) ప్రజల మేలుకోసం గాజాను అభివృద్ధి పరచటమంటే ట్రంప్‌నెతన్యాహూల రియల్ ఎస్టేట్ ఆలోచనను దృష్టిలో ఉంచుకునా? తమ మేలు ఏమిటో నిర్ణయించుకునే అధికారం అక్కడి ప్రజలకు ఉంటుందా? (3) ఈ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినా ఇజ్రాయెల్ దాడులు ఆగి, సైన్యం ‘యథాస్థానంలో’ ఆగిపోతుంది తప్ప పూర్తిగా ఉపసంహరించుకోదు. దశల వారీగా, పూర్తిగా ఉపసంహరించునేందుకు ‘తగిన పరిస్థితులు’ ఏర్పడే వరకు (?) అక్కడే ఉండిపోతాయి. ఈ 9వ వివరమైన అంశం సారాంశం ఏమంటే, భవిష్యత్తులో ఎప్పటికైనా పాలస్తీనా దేశం ఏర్పడే లోగా అక్కడ దశ దిశ యావత్తూ అమెరికా, దాని మిత్రులు నిర్దేశించే విధంగా రూపుదిద్దుకుంటాయి.
బోర్డ్ ఆఫ్ పీస్ పేరిట నెలకొల్పే ప్రధాన సంస్థకు ట్రంప్ అధ్యక్షుడవుతారు. అందులో టోనీ బ్లెయిర్ తోపాటు మరికొద్ది దేశాల అధినేతలు సభ్యులవుతారు. రోజువారీ పరిపాలన కోసం ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. అందులో నిపుణులైన పాలస్తీనియన్లతో పాటు అంతర్జాతీయ నిపుణులుంటారు. 2020 నాటి ట్రంప్ ప్రతిపాదనలు, సౌదీ ఫ్రెంచ్ ప్రతిపాదనలకు అనుగుణంగా పాలస్తీనా అథారిటీ ‘తనను తాను సంస్కరించుకుని’, పరిపాలనను స్వయంగా చేపట్టేందుకు ‘సిద్ధమయే వరకు’ ఈ ఏర్పాట్లు కొనసాగుతాయి. ఇపుడు ఈ అంశంలోని తెలివైన మెలికలను గమనించండి. యుద్ధ విరమణ జరిగి శాంతి ఏర్పడితే, పరిపాలన పోయేది అమెరికా అధ్యక్షుని బోర్డుతోపాటు, ఒక బయటి తాత్కాలిక ప్రభుత్వం చేతులోకి. పాలస్తీనియన్ల పాత్ర స్వల్పం. పాలస్తీనా అథారిటీ అనేది యథాతథంగానే బలహీనంగా మారి అమెరికా, ఇజ్రాయెల్ కనుసన్నలలో పని చేస్తున్నది. అటువంటి దిష్టి బొమ్మకైనా కొత్తగా ఏర్పడగల ఈ రెండు వ్యవస్థలలో నామకార్థపు పాత్ర మాత్రమే. భవిష్యత్తులో ఎపుడో అధికారం అప్పగించినా దాని స్థితి ఎట్లుండేదీ చెప్పనక్కర లేదు. ఈలోగా కూడా దానిని హాలులో ఒక పక్క కూర్చోబెడతారన్నమాట. అధికారం స్వీకరించగలగటానికి దానికి ఎన్ని షరతులు పెట్టారో గమనించండి. ఇక ఈ బోర్డులు, ప్రభుత్వాలు చేపట్టగల అభివృద్ధి నమూనా ఎవరి కోసం తయారవుతుందో ఎవరైనా ఊహించవచ్చు.
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో సామ్రాజ్యవాదానికి మొదటి నుంచి రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి, అక్కడి ఇంధన నిల్వలు. రెండు, భౌగోళిక వ్యూహాల రీత్యా ఆ ప్రాంతం కీలకం కావటం. మూడవది ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కలిగిన రియల్ ఎస్టేట్ ఆసక్తి. ఇపుడు ట్రంప్, నెతన్యాహూలు కలిసి ఇంతకాలం యుద్ధం ద్వారా గాని, ఇపుడు శాంతి పేరిట గాని నెరవేర్చుకొనజూస్తున్న ప్రయోజనాలు ఇవేనన్న సందేహం కలగక మానదు. 10వ అంశాన్ని గమనిస్తే, ఇది కేవలం సందేహం కాదని, వాస్తవమని అర్థమవుతుంది. అంశంలో ఆధునిక నగారాల నిర్మాణం, అంతర్జాతీయ పెట్టుబడులు, అందుకు వీలు కలిగించేట్లు పరిపాలనను, భద్రతను సమన్వయం చేయటం గురించి సూటిగానే రాసారు. అందుకోసం ఒక సెజ్ ఏర్పాటు చేయగలమని 11వ అంశం ప్రకటిస్తున్నది. ఇతరు అంశాలు చెప్తున్న దాని ప్రకారం దీనంతటి అమలు సజావుగా సాగేందుకు వెంటనే హమాస్ పూర్తిగా ఆయుధాలను వదలటమే గాక, తమకు రక్షణ కల్పిస్తున్న టన్నెల్స్ అన్నిటినీ కూల్చివేయాలి.
భవిష్యత్తులో దాని పాత్ర రాజకీయాలలోనూ ఏ విధంగానూ ఉండకూడదు. అంతేకాదు శాంతిభద్రతల కోసం ఒక అంతర్జాతీయ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. పాలస్తీనా పోలీసు శాఖ దానికి లోబడి పని చేస్తుంది. గమనించదగినదేమంటే, ఈ 20 అంశాలలో ఎక్కడ కూడా వెస్ట్‌బ్యాంక్ గురించి, అక్కడ అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే 70 వేల మంది యూదులను సెటిల్‌చేసి ఇంకా చేస్తుండటం గురించిన ప్రస్తావనలు, తూర్పు జెరూసలేమ విషయం లేనే లేవు. ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించబోదని (16) అన్నారు గాని, వెస్ట్‌బ్యాంక్ అనేది లేనేలేదని, అది ఇజ్రాయెల్‌లో భాగమని చేసిన నెతన్యాహూ ప్రకటన గురించి ఏమీ కనిపించదు. అందువల్ల, పాలస్తీనా హసించటం అనుమానాస్పదంగానే కనిపిస్తున్నది. గత 24 గంటల తాజా వార్తలను బట్టి, గాజా సమస్య పరిష్కారానికి అరబ్, ముస్లిం దేశాల బృందం చేసిన ప్రతిపాదనలకు, ఆ మేరకు ట్రంప్ మొదట అంగీకరించిన వాటికి, చివరన ప్రకటించిన 20 అంశాలకు తగినంత తేడా ఉంది. ఈ మాట పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్వయంగా తమ పార్లమెంటులో శుక్రవారం వెల్లడించారు. అంతకుముందు సుప్రసిద్ధ కొలంభియా యూనివర్శిటీ మేధావి ప్రొ॥ జెఫ్రీ శాక్స్ అదే విమర్శ చేసారు. ఆ ప్రొఫెసర్ తెలియపరచిన దానిని బట్టి ముస్లిం దేశాల ప్రతిపాదనలను ట్రంప్ అంగీకరించిన తర్వాత, నెతన్యాహూతోపాటు, లోగడ అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారిగా పని చేసిన ఒక దౌత్యవేత్త కలిసి ట్రంప్ మనసును మార్పించారు. ఆ ప్రణాళిక పట్ల విముఖంగా ఉన్నట్లు కనిపిస్తున్న హమాస్, శుక్రవారం నాడు, తమ కింకా సమయం కావాలని భావిస్తున్నది.
టంకశాల అశోక్
దూరదృష్టి