అమరావతి: తల్లి మందలించిందని కుమారుడు ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్‌లో లక్ష్మీదేవి తన కుమారుడు యశ్వంత్ రెడ్డి, భర్తతో కలిసి ఉంటుంది. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. యశ్వంత్ రెడ్డి బిటెక్ పూర్తి చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. వంటింట్లో లక్ష్మీదేవి పని చేస్తుండగా యశ్వంత్ రెడ్డి ఆమెతో గొడవపడ్డాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తండ్రిని ఓ రూమ్‌లో పడేసి అనంతరం తల్లి గొంతును కోశాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని లాక్కెళ్లి బయటపడేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు వెల్లడించారు.