మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎ న్నికలు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్ర తిపక్ష బీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ రెండు గండాలతో అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ భవితవ్యం ముడిపడి ఉండటంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవై పు స్థానిక ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకదాని వెంట ఒక టి జరుగనుండటంతో సర్వశక్తులు ఒ డ్డి ఏ విధంగా అయినా గెలిచితీరాలన్న గట్టి పట్టుదలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో పావులు కదుపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగబోతున్నట్టు అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగా సంకేతాలు ఇవ్వడంతో
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకొని ఉప ఎన్నిక కంటే ముందే స్థానిక ఎన్నికలకు శంఖం పూరించింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదునుపెట్టి అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంచార్జీలుగా నియమించిన ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగే శ్వరరావు, వివేక్ వెంకటస్వామిలకు అభ్యర్థి ఎంపికపై ప్రతిపాదనలు పంపించాలని కోరింది. అభ్యర్థి ఎంపిక మొదలు గెలిపించే వరకు ఈ ముగ్గురు మంత్రులదే బాధ్యత అని పార్టీ అధిష్ఠానం టాస్క్ విధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం వల్ల సానుభూతితో గెలుస్తారన్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అంచనా నెరవేరదని, కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమియే ఇందుకు నిదర్శనమని, అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడంతో విజయం సాధించినట్టే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలోనూ అన్ని కోణాల నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. గత శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ నగరం నుంచి ఒక్కరు కూడా గెలువకపోయినప్పటికీ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అంతకుముందు బీజేపీ నుంచి పోటి చేసి ఓటమి పాలైన శ్రీ గణేశ్‌కు టికెట్ ఇచ్చి వ్యూహత్మకంగా కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
అదేరకమైన వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ పదును పెడుతోంది. ఉప ఎన్నిక జరిగే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించడమే కాకుండా గడిచిన రెండు నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ నియోజకవర్గ ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో మైనార్టీ ఓటర్లు ఉండటంతో ముందుగానే ఎంఐఎం పార్టీతో అవగాహనకు వచ్చింది. ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దించకుండా ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విధంగా వ్యూహత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగానే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అమేర్‌ఖాన్‌ను తప్పించి అజారుద్దీన్‌ను ఎంపిక చేసినట్టు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపించాయి. బీఆర్‌ఎస్ ఎంపిక చేసిన అభ్యర్థి కుటుంబ నేపథ్యం నాన్ లోకల్ కావడంతో పూర్తిగా స్థానికత, సామాజిక సమీకరణ కోణాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థిని ఎంపిక చేసే దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్‌ది కాదు. ఇక్కడ తిరిగి గెలువడమనేది కాంగ్రెస్ కంటే సిట్టింగ్ సీటు అయిన బీఆర్‌ఎస్‌కే అత్యంత ప్రతిష్టాత్మకం. పైగా గత శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా గెలుపొందలేదు. అలాంటి చోట ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం ద్వారా బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా మరింత బలహీనపరిచినట్టు అవుతుందని అంచనా వేస్తోంది.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వ్యూహవ్యూహాలు ఇలా ఉండగా ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల చీలిక, ప్రధాని మోడీ ఇమేజి, ఇటీవల తగ్గించిన జిఎస్‌టి, పహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన పేరుతో జూబ్లీహిల్స్ వంటి కాస్మోపాలిటిన్ ప్రాంత నియోజకవర్గంలో గెలిచే అవకాశం లేకపోలేదనే కోణంలో బీజేపీ కూడా ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తోన్న పార్టీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ పాత్ర ఏంటో కూడా ఈ ఎన్నికలో తేలిపోనున్నది.
సంక్షేమంపై కాంగ్రెస్, వ్యతిరేకతపై బీఆర్‌ఎస్ ఆశలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంటే స్థానిక సంస్థలపైనే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఎక్కువగా గురిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేదని, తీవ్ర నిధుల సమస్యతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదని, పైగా ఇటీవల రైతులు యూరియా కొరతతో ఎదుర్కొన్న ఇక్కట్లతో గ్రామీణ ఓటర్లు స్థానికంలో తమ పార్టీకే పట్టం కడుతారని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీనేమో అధికారంలో ఉండే పార్టీలకే స్థానిక ఎన్నికలలో ప్రజలు పట్టం కట్టడం రీవాజు అని, అధికార పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతాయనే భావనతో ప్రజలు ఓట్లు వేస్తారని అంచనా వేస్తోంది. పైగా ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు, సకాలంలో రైతు భరోసా, రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ, బీసీలకు చరిత్రలో కనీవిని రీతిలో 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలతో స్థానిక ఎన్నికలలో వందకు వంద విజయం సాధించడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎన్నికలలో ప్రజల వద్దకు వెళ్లడానికి బీజేపీకి ఒక అస్త్రం అంటూ లేకుండా పోయింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గతంలో ఉన్న వ్యతిరేకత ప్రజలలో ఇంకా పోలేదని, దీనికి తోడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో ప్రత్యామ్నాయ పార్టీగా తమనే ఆధరిస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలలో కలిసి వచ్చే అంశాలు, ఏ విధంగా విజయతీరాలకు చేరుస్తుందన్నది అన్ని పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి.