రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే అంశంపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఒక వైపు ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) స్థానిక సంస్థల ఎన్నికలను ఐదు దశల్లో పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం వైపు పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల నిర్వహణలో ఉన్న చట్టపరమైన, సాంకేతిక అంశాలపై ఇటు రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికే కేసు కొనసాగుతుండగా, అటు సుప్రీం కోర్టులో కూడా మరో పిటీషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 6న ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనుంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటీషన్ దాఖలు చేశారు. మరో వైపు ఈ నెల 8న హైకోర్టు విచారణలో ఏం చెబుతుంది, ఎన్నికలు జరుగుతాయా.. లేదా..? అంటూ ఆశావహులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ల అంశంపై చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయని బహిరంగంగా అంతా చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు తారు మారవుతాయని కూడా చర్చ జరుగుతోంది. ఏడాదిన్నర తర్వాత ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళుతుంటే ఎన్నికలు ఆగిపోతాయనే ప్రచారం ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తుండడంతో ఎన్నికల పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది.
9 నుంచి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందా..?
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా..? లేదా..? అని మదనపడుతున్నారు. అయితే రిజర్వేషన్ల కోటా 50 శాత దాటిందని పేర్కొంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటీషన్ విచారణ అనంతరం అక్టోబర్ 8కి హైకోర్టు వాయిదా వేసింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుండగా. అక్టోబర్ 8న కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు రెండు ఉన్నత న్యాయస్థానాల్లో ఎటువంటి ఆదేశాలు వస్తాయోనని ఆందోళనలో ఉన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది.
మరోవైపు సుప్రీ కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇవ్వడంతో రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ కీలక అంశంపై కోర్టులు ఏవిధంగా స్పందిస్తాయనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో పిటిషన్ జరిగిన వి చారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యా ఖ్యలు చేసింది. బీసీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండగా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇలా కేసు కోర్టులో ఉండగానే ఎన్నికల షె డ్యూల్ విడుదలైంది. ఈ పరిస్థితిలో 42 శాతం రిజర్వేషన్లను ఒక వేళ హైకోర్టు కొట్టివేస్తే ఎన్నికల పరిస్థితి ఏమిటనే విషయంపై ఆందోళన నెలకొంది. అప్పుడు ప్రభుత్వం మరో ఆలోచనగా పా త రిజర్వేషన్ల విధానంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని, ఒక వేళ అదే జరిగితే ఇప్పుడు ప్రకటించిన బిసి రిజర్వేషన్లు తారుమారయ్యే అవకాశం ఉంది. దీనిపై ఆశావహులు తీవ్రంగా కలత చెందుతున్నారు. అయితే ఎస్సీ, ఎస్టి రిజర్వేషన్లు యధావిధిగానే ఉంటాయని, బీసీ రిజర్వేషన్లు మాత్రం మారుతాయని చెబుతున్నారు.