సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగకు తల్లిగారింటికి వచ్చి తిరుగు ప్రయాణంలో రాజీవ్ రహదారిపై సీతాఫలాలు కొనుగోలు క్రమంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని డిసిఎం వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా, కరీంనగర్ రూరల్ మండలం, బొమ్మకల్ ప్రాంతానికి చెందిన రామోజు సుమన్, వీణరాణి దంపతులు. వారి పిల్లలు మనస్విని, యశస్వినితో కలిసి దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా కోహెడ మండలం, వింజపెల్లిలోని పుట్టింటికి కుటుంబ సభ్యులతో వెళ్ళింది. శనివారం తిరుగు ప్రయాణంలో కరీంనగర్‌కు వెళ్తుండగా దేవక్కపెల్లి స్టేజి వద్ద సీతాఫలాలు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని ఆపారు.
అదే సమయంలో హైదదాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న డిసిఎం వ్యాను కరీంనగర్ వెళ్తున్న వరి కోత మిషన్ విడిభాగాన్ని తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ క్రమంలో సీతాఫలాలు కొనుగోలు చేస్తున్న సుమన్, వీణ కుటుంబ సభ్యులను హార్వెస్టర్ విడిభాగం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో వీణ, ఆమె కూతురు మనస్విని సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీణ భర్త సుమన్, ఆమె పెద్ద కుమార్తె యశస్విని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న సిద్దిపేట్ ఎసిపి రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎసిపి సుమన్ ఎస్‌ఐ సౌజన్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డిసిఎం వ్యాన్ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.