నక్సల్స్‌తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం స్పష్టం చేశారు. ముందు వారు బేషరతుగా ఆయుధాలు వదిలిపెట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన లాభసాటి లొంగుబాటు, పునరావాస విధానాన్ని ఆమోదించాలని తెలిపారు. చత్తీస్‌గఢ్‌లోని జగదల్పూరులో బస్తర్ దషేరా లోకోత్సవ్, స్వదేశీ మేళాలో అమిత్ షా మాట్లాడారు. దేశంలో 2026 మార్చి 31 నక్సలిజం అంతానికి తుదిగడువుగా ఖరారు చేసుకున్నామని, దీనిపై వెనుకడుగులేదని, రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మనమంతా నక్సలిజానికి తుది వీడ్కోలు చెప్పబోతున్నామని ప్రకటించారు. ఆదివాసి సోదరీ సోదరులు అంతా కూడా అడవిబాట పట్టిన యువత ఆయుధాలు వీడి, జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపు నివ్వాల్సి ఉంది. వారు హింసామార్గం వైదొలగాలి, ప్రధాన స్రవంతిలోకి రావడం ద్వారా బస్తర్ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందించాలని తాను కూడా ఈ సందర్భంగా పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలు విచ్ఛిన్నం చేయాలని నక్సల్స్ యత్నిస్తే వారికి సిఆర్‌పిఎఫ్, స్థానిక పోలీసు బలగాలు తగు విధమైన జవాబు ఇస్తాయని చెప్పారు. అంతకు ముందు అమిత్ షా ఇక్కడి ప్రఖ్యాత మా దంతేశ్వరీ ఆలయాన్ని సందర్శించుకున్నారు. బస్తర్ ప్రాంతాన్ని ఎర్ర ఉగ్రవాదం నుంచి విముక్తం చేసే శక్తిని మన భద్రతాబలగాలకు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి 2026 మార్చి గడువును ప్రస్తావించారు. నక్సల్స్‌తో చర్చలు జరిపితే మంచిదని కొన్ని వర్గాలు చెపుతున్నాయి. ఎటువంటి సవాళ్లకు తలొగ్గకుండా బస్తర్ ప్రజా సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది.ఈ దశలో తమకు నక్సల్స్‌తో సంప్రదింపులు అవసరం లేదని షా తెలిపారు. చర్చల అవసరం ప్రభుత్వానికి లేదు. తాము ఎంచుకునే అవసరం కేవలం ఈ ప్రాంతం ఇతర ప్రాంతాలతో సమానంగా ముందుకు వెళ్లడమే అన్నారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత ముమ్మరం అయ్యి, వారు చక్రబంధంలో చిక్కినందునే చర్చల ప్రసక్తి వస్తున్నదనే అనుమానాలను అమిత్ షా వ్యక్తం చేశారు.