కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ప్రజలందరినీ పండుగలు పేరుతో మతం మత్తులో ముంచితేలిస్తున్నాయి. సహజంగా దేశంలో ప్రజలకు దైవభక్తి ఎక్కువ. దీనిని ఆసరాగా చేసుకుని భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన పాలకులు, ఆ ప్రమాణాలను, రాజ్యాంగ లక్ష్యాలను పక్కన బెట్టి, సెక్యులర్ అనే భావన పాటించకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మత క్రతువుల్లో పాల్గొంటూ, ప్రజలను కూడా వీటిలో భాగస్వామ్యం చేయడం జరుగుతున్నది. దీంతో దేశం లో తాండవిస్తున్న నిరుద్యోగం, అధిక ధరలు, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మానవ అభివృద్ధి వంటి అంశాలు పక్కదోవపట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలు కూడా ఇటువంటి అంశాలను సీరియస్‌గా ఆలోచించకుండా పండుగలు జరుపుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు.
ఈ మత మైకంలో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకలేకపోవడం బాధాకరం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, నేటికీ మన అక్షరాస్యత 74% శాతంగా ఉంది. ఇది కూడా కేవలం సంతకాలు చేసిన వారిని కలుపుకుంటే… లేదంటే అరవై శాతంలోపే… దీని వల్ల ప్రజల్లో చైతన్యం, అవగాహన లేకపోవడం వల్ల అసలు సమస్యలు, దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాలు అర్థం చేసుకోలేకపోవడంతో పాలకులుచెప్పే మాటల గారడీలో పడిపోతున్నారు. అందుచేతనే వారి జీవితాలు అన్ని రకాలుగా అంతంత మాత్రంగానే ఉన్నాయి.. నేటికీ దాదాపు సగం జనాభా ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ పథకం, సంక్షేమ పథకాలు, ఉచిత పథకాల మీదే ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని వివిధ రకాల పండుగలు దేశంలో ఉన్నాయి. పూర్వం కాలంలో మామూలుగా పండుగ కార్యక్రమాలు జరుపుకుని, వారి దైనందిన జీవితంలో మునిగిపోయే వారు. కానీ నేడు పండుగలను ‘పెద్ద పెద్ద ఈవెంట్స్’ లాగా ప్రభుత్వాలే జరపటం ఆశ్చర్యం వేస్తుంది. పుష్కరాలు అని, పౌర్ణమి అని, ఉత్సవాలు అని భారీ ఎత్తున, రోజులు తరబడి చేయడం జరుగుతుంది.కొద్ది మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేసి, భారీ ఎత్తున ప్రజల నుంచి ఆదాయం సమకూర్చుకోవడం జరుగుతుంది. అనగా భక్తిని ‘వ్యాపారం’ గా మార్చివేసారు. ప్రజలు నుంచి కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.
దేవస్థానాలు, ట్రస్టులు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు భారీగా ఆర్థికంగా బలపడుతున్న పరిస్థితి. నేటి ప్రభుత్వాలు ప్రజలకు కావలసిన విద్య, వైద్యం, కనీస అవసరాలు తీర్చడం మానేసి, ప్రజలను మభ్యపెట్టే మత క్రతువుల్లో పాల్గొనేటట్లు ప్రోత్సాహిస్తున్నాయి. అసలు ఈ ఆధునిక కాలంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే వివిధ రంగాల్లో అనగా అక్షరాస్యత, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి విషయంలో, సంతోష సూచిలో, మానవ అభివృద్ధి సూచికల్లో మనం ఎక్కడ ఉన్నాం అని ప్రశ్నించుకుని ప్రభుత్వాలు పనిచేయాలి. కొంతమంది చేతిలోనే దేశసంపద కేంద్రీకృతమై, కొద్దిమంది బిలియనీర్ల సంపద పెరుగుదలచూసి దేశం త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది అని మురిసి పోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఎందుచేతనంటే దాదాపు సగం జనాభా ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత, సంక్షేమ పథకాలతోనే జీవితాలు గడుపుతున్నారు. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే వంటి దేశాలను దృష్టిలో ఉంచుకుని మన దేశాన్ని నడిపించాలి. వలసలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. అవినీతిని నిర్మూలించాలి. దక్షిణ కొరియా, జపాన్, చైనా, క్యూబా వంటి దేశాలు ఉత్పత్తి రంగంలో ఎలా అభివృద్ధి చెందుతున్నయో చూసి దేశంలో అమలు చేయాలి. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీటవేయాలి. శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి.
‘ఆత్మనిర్భర్ భారత్, మేక్‌ఇన్ ఇండియా’ అనే కార్యక్రమాలు మొదలు పెట్టి దాదాపు దశాబ్దం కాలం గడిచినా ఏ మేరకు ఆ లక్ష్యం చేరేమో ఈ ప్రభుత్వాలు పునఃసమీక్ష చేసారా! ఇటువంటి అంశాలపై దృష్టి సారించడం మానివేసి, కేవలం మత క్రతువులకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తే ఎలా! ఎప్పటికి మన దేశం ‘వికసిత భారత్’ అవుతుంది…!? ప్రపంచ దేశాలు అన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే మన విద్యాలయాల్లో తిరిగి వాస్తు, జ్యోతిష్యం, మతపరమైన అంశాలు వంటివి ప్రవేశపెడుతుంటే, ఇక మన విద్యార్థులు అంతర్జాతీయ విద్యార్థిగా ఎలా మారతాడో ప్రభుత్వాలు చెప్పాలి. ఇకనైనా ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు విడనాడాలి. ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు స్వస్తి పలకాలి. ప్రభుత్వాలు ఇకనైనా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన వికసిత భారత్‌గా ఉంటుంది.
– ఐ. ప్రసాద్ రావు, 6305682733