అమరావతి: దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై ఎంపి గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జాతీయ ఎస్ సి కమిషన్ స్పందించడంతో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పిలకు నోటీసుల జారీ చేసింది. దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పిలకు 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించమని ఆదేశిస్తూ, నివేదికలో ఎఫ్ఐఆర్ వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు, అరెస్టులు, చార్జ్ షీట్ స్థితి తదితర సమాచారం ఇవ్వాలనీ ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
దేవళంపేట అంబేడ్కర్ విగ్రహ దహనం ఘటనపై తిరుపతి ఎంపి గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జాతీయ ఎస్సీ కమిషన్‌కు గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు పేర్కొన్నారు. ఇది కేవలం విగ్రహ ధ్వంసం మాత్రమే కాదు, దళితుల గౌరవం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులపై నేరుగా దాడి అని ఎంపి ఫిర్యాదులో వివరించారు.