మనతెలంగాణ/హైదరాబాద్ : అరాచకత్వం, అ వినీతి, అనుభవలేమి కలగలిసిన రేవంత్ పాలన లో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోంద ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వే దికగా విమర్శించారు. సెప్టెంబర్ 2025 నెలలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్ల వృద్ధి రేటు లో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండటం దారుణమని అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని పేర్కొన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం, కెసిఆర్ సమర్థ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందని గుర్తు చే శారు. జిఎస్‌టి వృద్ధిలో ఈ పతనం, రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక నిదర్శనమని ధ్వజమెత్తారు.
గత బిఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయం నుండి ఐటి వరకూ అన్ని రంగాలకు రాష్ట్ర ప్ర భుత్వం గట్టి దన్ను ఇవ్వడంతో ఆర్థికవ్యవస్థ పరుగులు తీసి, రికార్డులు తిరగరాసిందని తెలిపారు. కానీ, నేడు కాంగ్రెస్ పాలనలో, పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా కూడా అన్ని రంగాలూ నేలచూపులే చూస్తున్నాయని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లోనూ దైన్యమే తాండవిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపడానికి చర్యలు తీసుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.