దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2026 పరీక్షకు సంబంధించి షెడ్యూల్ ఈనెలలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఇటీవల సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల కావడంతో.. దాని ఆధారంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) అధికారులు జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్ రూపకల్పనకు ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జెఇఇ మెయిన్ జాతీయస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష. ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు విడతల్లో (జనవరి, ఏప్రిల్) నిర్వహిస్తుంది. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు అభ్యసిస్తున్న విద్యార్థులు జెఇఇ మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరిలో జెఇఇ మెయిన్ సెషన్ 1, ఏప్రిల్‌లో సెషన్- 2 పరీక్ష జరుగుతుందని ఇటీవల ఎన్‌టిఎ స్పష్టం చేసింది.
అయితే, సెషన్ 1 పరీక్షకు అక్టోబర్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్‌టిఎ పలు సూచనలు చేసింది. విద్యార్థులు ఆధార్‌లో తమ పేరు, పుట్టిన తేదీ, తాజా ఫొటో, చిరునామా, తండ్రి పేరు తదితర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని, ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించింది. ఇడబ్లూఎస్, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, దివ్యాంగులు తమ ధృవపత్రాలు సిద్ధం చేసుకోవాలని తెలిపింది. జెఇఇ మెయిన్‌కు గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు.