తాను పదేళ్ల వరకు సంగారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయబోనని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సంగారెడ్డిలోని గంజ్ మైదాన్‌లో దసరా వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాజకీయ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికల్లో తన భార్య నిర్మల పోటీ చేస్తుందని, పదేళ్ల తర్వాత మళ్లీ తాను పోటీ చేస్తానని ప్రకటించారు. తన భార్యకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ‘ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉన్నది. తొందరేం లేదు..నిర్మల హర్డ్‌వర్కర్..రాత్రి 12 గంటలకు ఫోన్లు వచ్చినా సమాధానం ఇస్తుంది..మొన్న నైట్ నేను చూశాను’ అని పేర్కొన్నారు. అందుకని ‘ఆమెను అసెంబ్లీ క్యాండెట్‌గా ప్రకటిస్తున్నాను. నేను బ్యాక్ గ్రౌండ్‌లో ఉంటా. పనులు చేయిస్తాను. ఇప్పుడు నా వయస్సు 59. నన్ను మూడుసార్లు ఎంఎల్‌ఎగా గెలిపించారు. శక్తికొలది పనులు చేయించాను. ఐఐటి తెచ్చాను. ఐఐటి తెచ్చాను. అన్నీ చెబితే టైం సరిపోదు’ అని అన్నారు. ‘నాడు వైఎస్ మొదలు కిరణ్‌కుమార్ రెడ్డి వరకు సిఎం ఎవరున్నా..పనులు చేయించాను.
ఇప్పుడు సిఎం రేవంత్‌రెడ్డి ద్వారా సంగారెడ్డిని అభివృద్ధి చేస్తాను. కష్టకాలంలో పార్టీ కోసం సేవ చేసిన చేర్యాల ఆంజనేయులుకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. దసరా వేడుకల వేదిక మీది నుంచే అన్ని అంశాలపై మీకు స్పష్టంగా చెబుతున్నాను’ అని వివరించారు. ‘మీకు ఏం పనులు కావాలన్నా కూన సంతోష్ ఉన్నాడు. ఇతనే మనకు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి’ అని ప్రకటించారు. కిరణ్ గౌడ్‌ను కూడా సభకు పరిచయం చేశారు. ‘యువకులు ఎక్కువ స్పీడ్‌తో బండ్లు నడపొద్దు. ప్రమాదాలు చేయవద్దు, తల్లిదండ్రులకు శోకం కలిగించవద్దు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడొద్దు’ అని హితవు పలికారు. తన కొడుకుకు కూడా రోజూ ఇదే విషయం చెబుతానని అన్నారు. ఈ సందర్భంగా రావణ దహనం నేత్రపర్వంగా నిర్వహించారు. పటాకుల మోతతో ఆ ప్రాంగణం మార్మోగింది. అనంతరం సినీ గాయకులు పాటలు పాడారు. ‘నేను అందుబాటులో ఉండను. పిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్, పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, పార్టీ నియోజక ఇన్‌ఛార్జి చేర్యాల ఆంజనేయులు, యువ నాయకులు కూన సంతోష్, కిరణ్, బొంగుల రవి, జ్యోతిర్వాస్తు పీఠం ఫౌండర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు.