కరీంనగర్ జిల్లా, మానకొండూర్ మండలం, ఈదులగట్టెపల్లి బ్రిడ్జి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఓ లారీ వేగంగా వచ్చి కార్లను బలంగా ఢీకొనడంతో కార్లు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. మూడు కార్లలో ఒకటి నుజ్జునుజ్జు అయినట్లు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..ఎన్‌ఎచ్ 563 రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈదులగట్టెపల్లి స్టేజీ వద్ద వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వంతెన పనులు జరుగుతుండగా మట్టి రోడ్డు ఇరుకుగా మారడంతో నిత్యం వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ లారీ అతివేగంగా వచ్చి ముందున్న మూడు కార్లను ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి.
అసలే ఇరుకు రోడ్డు కావడం.. ఆపై పూర్తిగా ధ్వంసమైన కారు రోడ్డుపైనే ఉండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు నాలుగు గంటల పాటు కరీంనగర్, వరంగల్ ప్రధాన రహదారిపై ఇరువైపుల వాహనాలు స్తంభించిపోయాయి. నాలుగు గంటల పాటు ఇరువైపులా వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ కారణంగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ యువ కానిస్టేబుల్ వైఖరితో ప్రయాణికులు మరింత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ కానిస్టేబుల్ రోడ్డుపై ఉన్న కారును పక్కకు తీసే ప్రయత్నం కంటే ప్రయాణికులను ఇబ్బంది పెట్టేందుకే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపించింది. చివరికి క్రేన్ సహాయంతో రోడ్డుపై ఉన్న కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.