దైవదర్శనం కోసం వచ్చిన ఎపి చెందిన యువతిపై తిరువణ్ణామలైలో ఇద్దరు తమిళనాడు పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు కలకలం రేపాయి. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు పోలీసులను కూడా విధుల నుంచి తొలగించారు. వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ మేరకు తిరువణ్ణామలై పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… తిరువణ్ణామలై ఎఎస్‌పి సతీష్ కుమార్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ”సెప్టెంబర్ 29న అరటి గెలలతో ఒక కార్గో వాహనం ఎపి నుంచి తిరువణ్ణామలైకు చేరుకుంది. తిరువణ్ణామలైని దర్శించుకునేందుకు ఆ వాహన డ్రైవర్ చెల్లెలు, ఆమె 19 ఏళ్ల కూతురు కూడా ఆయనతో పాటు అదే వాహనంలో వచ్చారు” అని తెలిపారు. ”తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తిరువణ్ణామలై బైపాస్‌కు సమీపంలోని ఎంథాల్‌కు వారి వాహనం చేరుకుంది . ఆ సమయంలో రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న తిరువణ్ణామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సురేష్ రాజ్, సుందర్ ఆ వాహనాన్ని ఆపి, తనిఖీ చేశారు.’
‘ అరటి గెలలను తీసుకెళ్తున్నానని, ఆలయానికి వెళ్లేందుకు తనతో పాటు బంధువులు కూడా వచ్చారని డ్రైవర్ వారికి చెప్పాడు” అని సతీష్ కుమార్ అన్నారు. అయితే, ‘పోలీసులు ఆ డ్రైవర్‌ను బెదిరించి 19 ఏళ్ల యువతిని, ఆమె తల్లిని తమతో తీసుకెళ్లారు. అటవీ ప్రాంతానికి సమీపంలో 19 ఏళ్ల యువతిపై ఆ ఇద్దరు పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారు‘ అని ఎఎస్‌పి చెప్పారు. ”అనంతరం, వారిని తీసుకొచ్చి బైపాస్‌కు సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఏడుస్తూ ఉండడం అక్కడి స్థానికులు చూసి, ఏం జరిగిందో అడిగి తెలుసుకుని, వారిని రక్షించి తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో చేర్పించారు” అని సతీష్ కుమార్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తిరువణ్ణామలై జిల్లా ఎస్పీ ఎం.సుధాకర్ నేరుగా ఆస్పత్రికి వెళ్లి, బాధితులను విచారించారు. లైంగిక దాడి అభియోగాలపై సురేష్ రాజ్, సుందర్‌పై ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఆ ఇద్దరినీ అరెస్టు చేసి, జైలుకు తరలించారు. తొలుత ఈ ఇద్దరినీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయగా, ఆ తర్వాత ఉద్యోగాల నుంచి తొలగించారు.