అమరావతి: నర్సీపట్నం మెడికల్ కాలేజీని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి సందర్శిస్తారని వైసిపి మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలో జరిగిన పనులను జగన్ పరిశీలిస్తారు అని అన్నారు. ఈ సందరర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 9న వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన చేస్తారని, వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక చరిత్ర అని కొనియాడారు. విద్య, వైద్య రంగాలను ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేస్తున్నారని,10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. తన మనుషులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారని, ప్రైవేటీకరణను వైఎస్ఆర్ సిపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలియజేశారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని, కళ్లున్నా కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవగాహనతో మాట్లాడాలని కన్నబాబు సూచించారు. స్పీకర్ సందర్శిస్తే కాలేజీ నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం లేకుంటే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారని, చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు ఛీ కొడుతున్నా సిగ్గు లేదని ధ్వజమెత్తారు. జగన్ పై కక్షతో బాబు మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.