ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి యూదు రాజ్యంగా మార్చాలన్నదే లక్ష్యం గా పెట్టుకుని అమెరికా సామ్రాజ్యవాద ఆర్థిక, సైనిక సహకారంతో పాలస్తీనాలో ముఖ్యంగా గాజా ప్రాంతంలో నిరంతరం బాంబుల దాడుల తో వేలాది మంది ప్రాణాలను హరిస్తూ మారణకాండకు కారకుడు మారాడు. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో 2023 నుండి 26 జూన్, -2025 వరకు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారని గాజాలోని ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరుకాక భవనాల శిథిలాల కింద లెక్కకు రాని మరణాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో మరణించిన వారిలో మహిళలు, పిల్లలు 70%గా ఉన్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తు నిర్ధారించింది. గాజాలో సామాన్య పౌరులే గాక, 200 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలు, 233 మంది ఐక్యరాజ్య సమితి సిబ్బంది, వెయ్యి మందికి పైగా వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా మరణించారు.
తమకు నిలువ నీడలేని యూదులు కొందరు 20 శతాబ్ద ప్రారంభంలో పాలస్తీనాకు వలసవచ్చారు. ఒట్టోమన్ రాజ్యం చివరి కాలంలో ఐరోపానుండి నిరుపేదలుగా వచ్చిన యూదులను మానవతా దృక్పధంతో తమతో ఉండమని పాలస్తీనా ప్రజలు ఆహ్వానించారు. 1901 ఏర్పడిన యూదు నేషనల్ ఫండ్ (జెఎన్‌ఎఫ్) పాలస్తీనాలోకి యూదుల వలసలు పెద్దఎత్తున జరగటానికి, పాలస్తీనాలో యూదు రాజ్యం ఏర్పడటానికి కారణమైంది. పాలస్తీనా భూములు కొనుగోలు చేయడానికి, యూదు వలసదారులను స్థిరపరచడానికి జెఎన్‌ఎఫ్ ధనవంతులైన ప్రవాస యూదులకు నిధులు సమకూర్చింది. వేలాది ఎకరాల భూములను యూదులు ఆక్రమించారు. యూదుల వలసతో పాలస్తీనా ప్రాంతంలోని జనాభాలో మార్పు సంభవించాయి. 1920 బ్రిటిష్ ప్రభుత్వం లీగ్ ఆఫ్ నేషన్స్‌కు ఇచ్చిన తాత్కాలిక నివేదిక ప్రకారం పాలస్తీనా జనాభా 7,00,000గా వుంది. వీరిలో 4,80,000 మంది ముస్లిం లు, 77,000మంది క్రైస్తవులు, 77 వేలమంది యూదులు ఉన్నారు. గత 40 సంవత్సరాల్లో లక్షలాది యూదులు పాలస్తీనాకు వలస వచ్చారు. ఫలితంగా యూదులు పాలస్తీనాపై ఆధిపత్యం పోరాటం కొనసాగించారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తాము సృష్టించిన సమస్యను వారి కుయుక్తులకు అనుగుణంగా కొనసాగించటానికి తాజాగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి పాలస్తీనా సమస్యను బదిలీ చేశారు. ఐక్యరాజ్య సమితి పాలస్తీనాపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలుగా ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళిక ప్రకారం 56% భూమిని ఇజ్రాయెల్‌కు, 42% భూమిని పాలస్తీనాకు, మిగిలిన జెరూసలేంను ఐక్యరాజ్య సమితి నియంత్రణలో అంతర్జాతీయ నగరంగా పేర్కొంది. ఐక్య రాజ్య సమితి చేసిన పరిష్కారం వాస్తవానికి విరుద్ధంగా వుంది. పాలస్తీనా భూభాగంలోకి వలస వచ్చిన వారికి ఎక్కువ భూమిని కేటాయించడం పాలస్తీనా ప్రజలకు అన్యాయం చేయటమే. అసలు ఇజ్రాయెల్ ఏర్పాటే తప్పు. పాలస్తీనా ప్రాంతాన్ని ఆ ప్రజల రాజ్యంగా చెప్పి, వలస వచ్చిన యూదులను ఆ రాజ్యంలో నివసించే వారిగా నిర్ణయం ప్రకటించి ఉంటే సముచితంగా ఉండేది. పాలస్తీనా అరబ్బులు, అరబ్ లీగ్ (అరబ్ దేశాల కూటమి)లు రెండు ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళికను అంగీకరించలేదు.
ఐక్యరాజ్య సమితి తీర్మానం తర్వాత స్థానిక పాలస్తీనా అరబ్ ప్రజల పోరాట విభాగాలు ఏర్పడ్డాయి. 1947 లో దాదాపు మొత్తం సాగు భూమి విస్తీర్ణం పాలస్తీనా ప్రజల చేతుల్లోనేఉంది. 5.8% మాత్రమే యూదుల యాజమాన్యంలో ఉంది. 1947 కి ముందు ఇజ్రాయెల్ నాయకత్వం లక్ష్యం పాలస్తీనా అంతట యూదు రాజ్యాన్ని ఏర్పాటు చేయటం. అది జరగాలంటే పాలస్తీనా జనాభాలో 80 నుండి 90% జనాభాని తీసివేయాలి. అందుకు జాతి హననాన్ని చేపట్టింది. నేడు గాజాలో జరుగుతున్న మారణకాండ అందులో భాగమే. జాత్యహంకార ఉన్న యూదులు (జియోనిస్టులు) రెండు విధాలుగా ఈ పనిని ముందుకు తీసుకువెళ్లారు. ఒకటి హింసాత్మక సాయుధ మూకలను సృష్టించటం, రెండోది- పాలస్తీనా గురించి మొత్తం సమాచారాన్ని గూఢచార వ్యవస్థ ద్వారా సేకరించటం.ఆ విధంగా పాలస్తీనాకు సంబంధించిన అన్ని రంగాల సమాచారం సేకరించారు.
1959 అక్టోబర్‌లో పాలస్తీనా విముక్తి ఉద్యమం, పాలస్తీనా లిబరేషన్ మూమెంట్ సంస్థలను యువకులు స్థాపించారు. వీటి లక్ష్యం మొత్తం పాలస్తీనాను విముక్తి చేసి వలసవాదుల ఇజ్రాయెల్ రాజ్యం, సమాజం పునాదులను నాశనం చేయడం. యాసిర్ అరాఫత్ నాయకుడిగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పిఎల్‌ఎ) స్థాపనమే 1964లో ప్రకటించబడింది. ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళిక, ఇజ్రాయెల్ స్థాపన చట్టవిరుద్ధమైన చర్యలని ఈ సంస్థ ప్రకటించింది. పాలస్తీనా మొత్తాన్ని అరబ్ మాతృభూమిగా విముక్తి చేయాలని పిలుపు ఇచ్చింది. పాలస్తీనాలో అమెరికా మధ్యవర్తిత్వంలో శాంతి చర్చలు, శాంతి ఒప్పందాలు, శిఖరాగ్ర సమావేశాలు పెద్ద ప్రహసనంగా ఉన్నాయి. ఈ సమావేశాల ఉద్దేశం పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ విస్తరణను రక్షించటమే. 1991 మాడ్రిడ్ సమావేశం, 1993లో ఓస్లా ఒప్పందాలు, 2000 నాటి క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సమావేశం ఇజ్రాయెల్ ప్రతిపాదనలను అంగీకరించమని పిఎల్‌ఒపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఉండేవి.
అసలు అమెరికా మధ్యవర్తిత్వం వహించడాన్ని పిఎల్‌ఒ అంగీకరించడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే అరబ్ దేశాల ఆయిల్ గనులను కొల్లగొట్టడానికి, ఆ దేశాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ను వాడుకుంటూ దానికి ఆయుధాలు, ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున అందిస్తూ పాలస్తీనా పైనా ముఖ్యంగా గాజాపైన దాడులు చేయిస్తున్నది అమెరికానే. 1949నుండి 2005 వరకు ఇజ్రాయెల్‌కు 100 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్లను (ఆ కాలంలో లక్ష కోట్ల రూపాయలు) ఇచ్చింది. అది గాక 10 వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. బుష్ పాలనలో ఇజ్రాయెల్‌కి చేసిన సైనిక సహాయం 21 బిలియన్ డాలర్లు (2006 రూపాయి మార్పిడిలో 95 వేల కోట్లు) ఒబామా బేషరతు సైనిక సహాయం (2010) లక్షా 35 వేల కోట్లు. 2023లో బైడెన్ పాలనలో 17 బిలియన్ డాలర్లు (లక్షా 40 వేల రూపాయలు) సైనిక సహాయం అందించాడు. 1946 నుండి 2024 మధ్య ఇజ్రాయెల్‌కి అందిన మొత్తం సహాయం 3 వందల బిలియన్ డాలర్లు. ఇందులో 220 బిలియన్ డాలర్లు (11 లక్షల కోట్ల రూపాయలు) సైనిక సహాయంగా ఉంది. అమెరికానుంచి అత్యధికంగా సహాయం అందుకున్న దేశం ఇజ్రాయెల్ మాత్రమే.
పాలస్తీనాపై ముఖ్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుండి వైదొలగాలని 1967 ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. పాలస్తీనా స్వయం నిర్ణయాధికారం గల స్వతంత్ర దేశంగా గుర్తించాలని, ఇజ్రాయెల్ దురాక్రమణలను ఖండించాలని 1974లో ఐరాస మరో తీర్మానం చేసింది. గాజాకు మానవతా సహాయాన్ని అడ్డంకులు లేకుండా చేసేందుకు ఆమోదించాలని, శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని 2024లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసింది. 2024 డిసెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాలను ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఇంకా అనేక తీర్మానాలు కూడా ఐక్యరాజ్యసమితి చేయటం జరిగింది. ఐక్యరాజ్య సమితి చేసిన ఏ తీర్మానం అమలు జరగలేదు. తీర్మానాలకే ఐరాస పరిమితమైంది. ఆ తీర్మానాలకు విలువ లేకుండాపోయింది. అమెరికాకు ఐక్యరాజ్య సమితి లొంగిఉండటమే అందుకు కారణం. తన దాడులు, మారణకాండను ఇజ్రాయెల్ తీవ్రం చేసింది.
1988లో పాలస్తీనా అధికార ప్రతినిధి అయిన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పిఎల్‌ఒ) అధికారికంగా పాలస్తీనా రాజ్యస్థాపనను ప్రకటించింది. అప్పటి నుండి అనేక దేశాలు పాలస్తీనా రాజ్యాన్ని గుర్తిస్తూ వస్తున్నాయి. సెప్టెంబర్ 2025 నాటికి ఐక్యరాజ్య సమితిలోని 193 దేశాల్లో 157 దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. తాజాగా బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియాలు కూడా పాలస్తీనానుస్వతంత్ర దేశంగా గుర్తించాయి. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ సాగిస్తున్న పాశవిక మారణకాండ పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తంకావటం, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియాల్లో పెద్ద ఎత్తున పాలస్తీనాకు అనుకూలంగా ప్రజాప్రదర్శనలు జరగటం ఈ దేశాలు గుర్తించటానికి కారణంగా ఉంది. 2012 నుండి పాలస్తీనా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సభ్యదేశంగాని, పరిశీలక దేశంగా ఉంది. గత సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీ పాలస్తీనాకు అదనపు హక్కులను మంజూరు చేసింది.
దాని ప్రకారం సభ్యదేశాల్లో కూర్చోవటం, ప్రతిప్రాదనలను ప్రవేశపెట్టే, కమిటీలలో పాల్గొనే హక్కులు ఏర్పడినా ఇప్పటికీ ఐరాసలో దానికి ఓటు హక్కు లేదు. ఐరాస పాలస్తీనాను ఆ విధంగా గుర్తించకపోవటం దాని వైఫల్యానికి నిదర్శనం. ఐరాసలో స్వతంత్ర సార్వభౌమ దేశంగా గుర్తించే తీర్మానాన్ని అమెరికా వీటో చేస్తూ, ఆ హక్కు దుర్వినియోగం చేస్తున్నది.అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గాజాపై సాగిస్తున్న బాంబు దాడులు, మారణకాండను వెంటనే ఆపాలని, నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా బోనులో నిలబెట్టి శిక్షించాలని, పూర్తి సభ్యత్వ దేశంగా పాలస్తీనాను గుర్తించాలని, గాజాకు ఆహార ధాన్యాలు, మందుల సరఫరాను అడ్డుకోరాదని, గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న పాశవిక దాడులను మోడీ ప్రభుత్వం ఖండించాలని భారత ప్రజలు డిమాండ్ చేయాలి.
-బొల్లిముంత సాంబశివరావు
– 98859 83526