పాకిస్తాన్ జట్టును ఓడించి ఇండియా క్రికెటర్లు ఆసియా కప్‌ను గెలుచుకున్న సందర్భంగా తమ ఆనందాన్ని ప్రధాని మోడీ ఎక్స్‌వేదికగా పంచుకున్నట్లు ఒక పోస్ట్ వచ్చింది. ఆ గెలుపును ఆపరేషన్ సిందూర్‌తో పోల్చుతూ ‘మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్.. అదే ఫలితం.. భారత విజయం.. క్రికెటర్లకు అభినందనలు’ అని అందులో ఉంది. క్రీడాస్ఫూర్తిని ఉగ్రవాదుల దుశ్చర్యతో ముడిపెడుతూ ప్రధాని పేరిట ఉన్న ఈ పోస్టు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అది నిజంగా ప్రధాని సొంత అభిప్రాయమేనా అని అనుమానం వ్యక్తమైంది. ప్రధాని ఎక్స్ ఖాతాను అధికారికంగా నిర్వహించేవారు ముందస్తుగా ఈ పదజాలాన్ని ఆయన దృష్టికి తెచ్చారా అని కొందరు తమ సందేహాన్ని ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ అంటేనే అదొక సంచలనం. ఈ పోటీని ఇరు దేశాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. మొదట దాయాదుల మధ్య పోటీగా ఆసక్తి కలిగించిన ఈ క్రీడల రూపం ఇప్పుడు మారిపోయింది. రెండు దేశాల మధ్య పెరిగిన శత్రుత్వం నీడలు వీటిలో భాగమయ్యాయి.
క్రీడల విషయానికొస్తే మిగతా అన్నిదేశాల మాదిరే అదొక ప్రత్యర్థి టీమ్. గెలుపోటములు ఆయా జట్టుల సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి. ఈసారి రెండు దేశాల మధ్య జరిగిన మూడు ఆటల్లోను భారత్ గెలిచింది. ఈ గెలుపును మరో ఆపరేషన్ సిందూర్‌గా ప్రధాని పోస్టులో అభివర్ణించడమే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని క్రీడాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రమూకల దాడి అత్యంత దారుణం. ఉగ్రవాదాన్ని, దాన్ని ప్రోత్సహించే ప్రభుత్వానికి దెబ్బకు దెబ్బలా బుద్ధి చెప్పాల్సిందే. భారత వాయుసేన పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై బాంబులు కురిపించి వాటిని నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్‌వల్ల తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపినట్లయింది. అయితే క్రికెట్ గెలుపును ఆపరేషన్ సిందూర్‌తో పోల్చడంలో అర్థమే లేదు. ఆటలో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు. ఓటమి తప్ప మరణాలు ఉండవు. ఓటమి ఎప్పుడూ చావుతో సమానం కాదు. స్పర్థలన్నీ మైదానానికే పరిమితం కావాలి. ఎసిసి ప్రెసిడెంట్‌గా ఉన్న పాకిస్తాన్ మంత్రి మొహిసిన్ నక్వీ గెలిచిన టీం కి ఆయన ట్రోఫీ అందజేయాలి. అయితే ఆయన భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని, ఆయన ద్వారా ట్రోఫీని అందుకోవడాన్ని మన దేశంలోని క్రికెట్ అభిమానులు నొచ్చుకుంటారని బిసిసిఐ అభిప్రాయపడింది.
తమ అయిష్టాన్ని బిసిసిఐ ముందుగానే నిర్వాహకులకు తెలియజేసింది. అంటే భారత జట్టుకు మరొకరి ద్వారా ట్రోఫీ ఇప్పించమని ఆ మాటల అంతరార్థం. అయితే తానే ఇస్తానని నక్వీ మొండిగా వేదికపై నిలబడిపోవడంతో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ ట్రోఫీ తీసుకోవడానికి స్టేజి పైకి వెళ్ళలేదు. దాంతో నక్వీ రన్నర్ అప్ టీమ్ పాకిస్తాన్ కెప్టెన్ మెడల్స్, చెక్ అందజేసి భారత్ ఆటగాళ్లకు ఇవ్వవలసిన పతకాలు, ట్రోఫీ పట్టుకొని లాడ్జికి వెళ్ళిపోయాడు. ఇదో మూర్ఖపు చర్య. పాకిస్తాన్ మంత్రిగా కాకుండా ఆయన ఎసిసి ప్రెసిడెంట్‌గా ఆలోచించి సామరస్యంగా ఆసియా కప్ ముగింపుకు పలకవలసింది. ఆయన పాకిస్తాన్ మంత్రి కాకుండా కేవలం క్రికెట్ ప్రెసిడెంట్‌గా ఉంటే ఈ రాద్ధాంతం తలెత్తేది కాదేమో! చివరకు ఆ ట్రోఫీని, పతకాలను దుబాయ్‌లోని ఎసిసి ఆఫీసులో అప్పగించమని బిసిసిఐ కోరింది. గెలిచిన ఆటగాళ్లు ఉత్త చేతులతోనే ఇంటికి వచ్చారు.
ఇప్పటికీ ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. పాకిస్తాన్ మంత్రి భారత్‌పట్ల తన అసహనాన్ని ఆటల్లో ప్రదర్శించడం క్రీడాస్ఫూర్తికే మాయని మచ్చ. రెండు దేశాలమధ్య ఉన్న ఉద్రిక్తత మైదానాన్ని వేడెక్కించింది. పాకిస్తాన్ ఆటగాళ్లతో చేయి కలపడానికి భారత క్రికెటర్లు నిరాకరించారని తెలుస్తోంది. అభివాదాలు, అభినందనలు స్వీకరించడం కనీస మర్యాద. టాస్ వేసినప్పుడు రెండు జట్ల మధ్య మాటలు లేక ఇరువైపులా మధ్యవర్తుల అవసరమైంది. అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని వాతావరణం ఏర్పడిందన్నమాట. మైదానంలో పాక్ ఆటగాళ్లు ఎన్నో ప్రేలాపనలు చేశారని, వాటికి మా విజయంతోనే జవాబు చెప్పామని భారత కెప్టెన్ అన్నారు.
ఆసియా కప్ విషయంలో తలెత్తిన వివాదాలను ఖండిస్తూ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ క్రీడాస్ఫూర్తిని ఎవరూ మరిచిపోరాదన్నారు. రాజకీయాలు, ఆటలని విడిగా చూడాలని ఆయన కోరారు. మాతో భారత్ ఆటగాళ్లు చేయి కలపకపోవడం కేవలం ఆటగాళ్లను అవమానించడమే కాదు, ఆటనే అవమానించినట్లు అవుతుంది. ఈ మ్యాచులు చూసే రెండు దేశాల యువతలో పరస్పర ద్వేషాన్నిపెంచే విధంగా భారత్ ఆటగాళ్ల వైఖరి ఉందని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. ఆతిథ్య దేశంగా దుబాయ్ నిర్వహిస్తున్న ఆసియా కప్‌కు విధివిధానాలుంటాయి. వాటికి అందరూ బద్ధులే. దేశాల స్పర్థలు ఆటలో కనబరిస్తే ఆ విషయాన్నీ తీవ్రంగా పరిగణించాలి. ఆటగాళ్ల ప్రవర్తనపై, నక్వీ తీరుపై, మోడీ వ్యాఖ్యపై క్రికెట్ పెద్దలు కలుగజేసుకొని, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి.
– బద్రి నర్సన్ 94401 28169