గాంధీజయంతిని (అక్టోబర్ 2న) పురస్కరించుకొని మాంసం, మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మాంసం, మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. దసరా పండుగ సందర్భంగా ఈ రెండు రోజులు మద్యాన్ని కొనుగోళ్లు చేయడానికి మందుబాబులు బారులు తీరారు. ఈ సారి దసరా పండుగ (గాంధీ జయంతి రోజున) రావడంతో ప్రజలు ముందస్తుగా భారీగా కొనుగోళ్లు జరపడం విశేషం. గత నెల సెప్టెంబర్ 29వ తేదీన రూ.279 కోట్లు, 30వ తేదీన రూ.333 కోట్లు, అక్టోబర్ 01వ తేదీన (బుధవారం) రూ.450 కోట్లకు పైగా (ఈ మూడు రోజుల్లో సుమారుగా రూ.1062 కోట్ల) మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిటైల్ మాంసం దుకాణాలు, చికెన్ సెంటర్లు, కబేళాలను గురువారం తప్పనిసరిగా మూసి ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రజలు బుధవారం మాంసాన్ని కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి కనబరిచారు.
గత సంవత్సరం 10 రోజుల్లో రూ.1,100 కోట్లకు పైగా మద్యం విక్రయం
గత సంవత్సరం (2024 సంవత్సరంలో) దసరా ముం దు, తరువాత 10 రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకుపైగా మందును మద్యం ప్రియులు తాగేశారు. పది రోజుల్లో వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగిన ట్లు ఆబ్కారీ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం బార్లు, మద్యం దుకాణాలతో పాటుగా పబ్‌లలోనూ అమ్మకాలు భారీగా పెరిగాయి.
10 రోజులవ్యవధిలోనే సుమారుగా రూ.1,100 కోట్ల మేర విలువైన 10 లక్షల 44వేల కేసుల మద్యం అమ్మకాలతో పాటు 17 లక్షల 59 వేల కేసుల బీర్లు అమ్ముడుపోవడం విశేషం. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్‌లో ఉండగా ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు తర్వా తి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.3 వేల 48 కోట్ల 51 లక్షల మద్యం అమ్మకాలు జరగ్గా 30వ తేదీ ఒక్కరోజే 333కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా 3 లక్షల 21 వేల లిక్కర్ కేసులు, 3 లక్షల 24 వేల కేసుల బీరును ఎక్సైజ్ శాఖ విక్రయించింది.
సెప్టెంబర్ నెలలో రూ.29 లక్షల 92 వేల కేసులు లిక్కర్‌ను, 36 లక్షల 48 వేల కేసుల బీర్లను ఆబ్కారీ శాఖ విక్రయాలు చేసింది. గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో రూ.210 కోట్లకు మద్యం సేల్ పెరిగిందని అధికారులు తెలిపారు.
ప్రిడ్జ్‌లో మాంసం నిల్వ
ఇక మాంసం ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాములుగా హాలీడే వస్తే మాంసం దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. అలాంటిది దసరా లాంటి పండగల సమయాల్లో డిమాండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈసారి దసరా గాంధీజయంతి రోజున రావడంతో మాంసం ప్రియులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే మాంసం ప్రియులు ముందు రోజే మటన్, చికెన్‌ను తెచుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నారు. డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యాపారులు బుధవారం అర్థరాత్రి వరకు అమ్మకాలు జరిపారు.