మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా, లింగాల గ్రామంలో జన్మించిన దామోదర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. సూర్యాపేట నుంచి ఒక పర్యాయం ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. 2023 చివరలో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. దామోదర్‌రెడ్డిని ఆయన అభిమానులు ‘టైగర్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన అంత్యక్రియలు తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దామోదర్ రెడ్డి పార్ధివదేహాన్ని కడసారి సందర్శించేందుకు 3న సూర్యాపేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి మరణం పట్ల సిఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.