వేధింపులకు తాళలేక ఓ భార్య తనను కట్టుకున్న భర్తను కడతేర్చిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉండే శ్రీనివాస్ (45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ ప్రతి రోజు తాగి వచ్చి భార్య సావిత్రితో గొడవ పడుతున్నాడు.మానసికంగా, శారీకంగా వేధిస్తుండేవాడు. పిల్లల్ని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కూడా భార్యతో గొడవ పడ్డాడు. భర్త వేధింపులు భరించలేని ఆమె ఎదురుతిరిగింది. కట్టెతో విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. సావిత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.