ఉద్యోగులకు రావాల్సిన హక్కులపై అడుగుతున్న ఉద్యోగ సంఘ నాయకులను సిఎం రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకులపై ఎసిబి దాడులు చేయిస్తామని భయపెట్టడం సిగ్గుచేటు అని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగులకు ఐదు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, చిరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్కార్ చిన్నచూపు చూస్తోందన్నారు. కెసిఆర్ రెండు విడతల్లో 73% పిఆర్‌సిని అందిస్తే అదే రేవంత్ రెడ్డి అందించడం లేదని మండిపడ్డారు. పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలను సైతం చెల్లించడం లేదన్నారు. కెసిఆర్ హయాంలో పోలీసులకు కొత్తగా ఇన్నోవా వాహనాలు ఇప్పిస్తే ఆ వాహనాల్లో కనీసం డీజిల్ వేయలేని పరిస్థితి కాంగ్రెస్ సర్కార్ పాలనలో నెలకొందని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డిఎను ప్రకటించి తీపి కబురు చెబితే..రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఎలు, పిఆర్‌సిలు ఇవ్వకుండా ఇబ్బందుల్లోకి నెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన కాలంలో సుమారు 20 వేల మంది ఉద్యోగులు రిటైరైతే వారికి ఇవ్వాల్సిన డబ్బులను సైతం ఇవ్వడం లేదన్నారు. హోల్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. సిపిఎస్ కంట్రిబ్యూషన్ రూ.5,500 కోట్లను సైతం మళ్ళించారని, ఈ డబ్బులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రావడం లేదన్నారు. దూప దీప నైవేద్యం కింద దేవాలయాల్లో పనిచేసే పూజారులకు సైతం జీతభత్యాలు ఇవ్వడం లేదన్నారు. హక్కులపై పోరాటం చేసే ఉద్యోగులకు బిఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింప చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి అందరి నోట్లో మట్టి కొట్టి కమీషన్లను దంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్లపై ఉన్న ప్రేమ ప్రజలపై, ఉద్యోగులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజలను పట్టించుకోని ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారు.
దక్షిణ భారత రైతులకు చిన్నచూపు చేస్తున్న కేంద్రం
కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ దక్షిణ భారత రైతులపై చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్న రైతులకు అండగా నిలిచి దక్షిణ భారత రైతులను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. క్వింటాల్ గోధుమకు మద్దతు ధరగా రూ.160 పెంచారు గానీ వడ్లకు మద్దతు ధర ఎందుకు పెంచడం లేదన్నారు. వరి పండించే రైతులకు ఒక నీతి, గోధుమలు పండించే రైతులకు ఒక నీతా అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించేది తెలంగాణ రైతులేనన్నారు. తెలంగాణ రైతుల పట్ల ఎందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు ఎంపిలంతా తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర సర్కార్‌ను నిలదీసి గోధుమలతో సమానంగా వడ్లకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, కోల రమేష్ గౌడ్, గుండు భూపేష్ తదితరులు పాల్గొన్నారు.